కొనుగోలు కేంద్రంలో ధాన్యం మాయం
చిన్నగూడూరు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి రక్షణ లేకుండాపోతోంది. కొనుగోలు కేంద్రంలో ఓ రైతుకు చెందిన 21 బస్తాల ధాన్యం మాయమైంది. ఈఘటన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో జరిగింది. మండలంలోని ఉగ్గంపల్లి శివారు ధూమ్డాతండాకు చెందిన రైతు బానోతు వీరన్న పండించిన వరి ధాన్యాన్ని 20 రోజుల క్రితం చిన్నగూడూరు కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. తేమశాతం వచ్చాక కొనుగోలు నిర్వాహకులు వారం క్రితం 116 బస్తాలకు కాంటా వేసినట్లు తెలిపాడు. కాంటా వేసిన మూడో రోజుకు లారీలో లోడ్ పంపించారు. వే బ్రిడ్జి కాంటా అయిన మరో రెండు రోజులకు 95 బస్తాలకే కాంటా అయినట్లు తన ఫోన్‌కు ఓటీపీ రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇదేంటని కొనుగోలు కేంద్రం చుట్టూ మూడు రోజులుగా తిరుగుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ రైతు బోరున విలపించాడు. తనకు న్యాయం చేయాలని ఆదివారం తండావాసులతో కలిసి కొనుగోలు కేంద్రంలో ఆందోళన చేపట్టాడు.
బోరున విలపించిన రైతు
పట్టించుకోని నిర్వాహకులు
కొనుగోలు కేంద్రంలో ధాన్యం మాయం


