వడదెబ్బపై అవగాహన కల్పించాలి
మహబూబాబాద్ రూరల్: వైద్యాఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వేసవికాలం దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ భూక్య రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వేసవికాలం దృష్ట్యా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ కార్నర్లను ఏర్పాటు చేయాలని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా సకాలంలో గర్భిణుల వివరాలను నమోదు చేయాలని, వ్యాధి నిరోధక టీకాలను వందశాతం పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సాగర్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఆరోగ్య విద్యా బోధకులు రాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మేరీ, ఎంపీహెచ్‌ఈఓ నరేశ్, సూపర్‌వైజర్లు చక్రి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ భూక్య రవిరాథోడ్


