‘పట్టు’.. రాయితీ కొట్టు..
డోర్నకల్ : రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం మల్బరీ సాగు, పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ‘సిల్క్ సమగ్ర పథకం’ ద్వారా అన్నదాతలకు మేలు చేకూర్చడానికి రాయితీలు కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరం పట్టు గూళ్ల ధర పెరుగుతుండడంతోపాటు జనగామ, హైదరాబాద్ మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో రైతులకు ఉద్యాన పట్టుపరిశ్రమ శాఖ రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. ఇతర వాణిజ్య పంటల కన్నా మల్బరీ, పట్టుపరిశ్రమతో అధిక లాభాలు వస్తుండడంతో రైతులకు అవగాహన కల్పించి సాగును పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిల్క్ సమగ్ర పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, జనరల్ రైతులకు వేర్వేరు రాయితీలు ప్రకటించింది.
మల్బరీ సాగుకు అనుకూలాంశాలు..
మల్బరీ సాగుకు నీటి అవసరం తక్కువ ఉంటుంది. ఈ మొక్కలు ఒకసారి నాటితే 10 నుంచి 15 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. నల్ల రేగడి, చౌడు భూములు మినహా మిగతా భూములన్నీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. రెండెకరాల్లో మల్బరీ సాగు చేస్తే మొదటి ఏడాది రెండు నుంచి మూడు పంటలు తీసుకుని రూ.2 లక్షల ఆదాయం పొందొచ్చు. రెండో సంవత్సరం నుంచి 6 నుండి 7 పంటలు తీసుకుని రూ.4 లక్షల ఆదాయం పొందొచ్చు. క్రిమి సంహారక మందుల వినియోగం అవసరం ఉండదు.
దరఖాస్తులకు ఆహ్వానం..
మల్బరీ సాగు, పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి కలిగిన రైతులు ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులు బి.వెంకన్న(పట్టుపరిశ్రమ అధికారి, 8977714628), కె.సురేశ్(సహాయ పట్టుపరిశ్రమ అధికారి, 8977714605), డి.రాజయ్య(సహాయ పట్టుపరిశ్రమ అధికారి 897771468) సంప్రదించాలి.
రైతులకు రాయితీలు(రూపాయల్లో)..
వివరాలు జనరల్ ఎస్సీ/ఎస్టీ
రెండెకరాల మల్బరీ సాగుకు 60,000 78,000
నీటి సదుపాయానికి 55,000 65,000
పట్టుపురుగుల రేలింగ్ షెడ్ నిర్మాణం 2,25,000 2,92,500
పరికరాలకు 37,500 48,750
రోగనిరోధక మందులకు 2,500 3250
కిసాన్ నర్సరీ ద్వారా
మొక్కల పెంపకం కోసం 75,000 97,500
మొత్తం 4,50,000 5,85,000
‘మల్బరీ’కి ప్రోత్సాహం
పంట సాగుకు ‘సిల్క్ సమగ్ర పథకం’
రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
రాయితీలతో ప్రోత్సహిస్తున్నాం
మల్బరీ సాగు, పట్టుపరిశ్రమ పెంపు కోసం రాయితీలతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. పత్తి, మిరప, వరి పంటలకు ప్రత్యామ్నాయ పంటగా మల్బరీ సాగు లాభదాయకంగా ఉంటుంది. సాగు కోసం రైతులు పట్టుపరిశ్రమ శాఖ అధికారులను సంప్రదించాలి.
–ఏ. ముత్యాలు, పట్టుపరిశ్రమశాఖ
ఉపసంచాలకుడు, మహబూబాబాద్
‘పట్టు’.. రాయితీ కొట్టు..
‘పట్టు’.. రాయితీ కొట్టు..


