
సంగెంలో ఆదిమానవుల సమాధులు
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి రెవెన్యూ శివారు బాలునాయక్‌తండాలో(బోడ బోల్లు) బోడగుట్టలపై పెద్ద రాతి యుగపు ఆదిమానవుల సమాధులను డిస్కవరీ బృందం సభ్యులు కూన ప్రతాప్, గుండా ఓంకార్ గుర్తించారు. ఈ మేరకు వారు ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈ సమాధులు క్రీ.పూ. 3500 నుంచి 1000 సంవత్సరాల నాటివని, ఈ రెండు గుట్టల మీద సుమారు 15 డోల్‌మన్ సమాధులు ఉన్నట్లు పేర్కొన్నారు. పాత మధ్యరాతి యుగాల్లో పెద్ద బండలను కదిలించలేని ఆదిమానవులు.. పెద్ద రాతి యుగానికి వచ్చే సరికి తెలివి , నైపుణ్యం మెరుగు పరుచుకుని పెద్ద రాళ్లను సైతం కదిలించి ఇలా సమాధులు సుస్థిరంగా ఉండేలా నిర్మించుకున్నారని తెలిపారు. నేటి ఆధునిక మానవులకు నాటి సమాధుల గురించి తెలియక గుట్టలతో పాటు సమాధులను సైతం ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. పాత రాతి యుగం, మధ్యరాతి యుగాల్లో ఆదిమానవులు కొండ గుహల్లో జీవించేవారని, కాల క్రమంలో కొండల నుంచి కిందకు దిగి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. ఈ బోడ గుట్ట కింద ఉన్న పాటిగడ్డ మీద నాటి పెద్ద రాతి యుగపు ఆదిమానవులు ఉపయోగించిన మృణ్మయ పత్రాలు, రాతి పనిముట్లు ఇప్పటికీ ఉన్నాయన్నారు. కాగా, కొన్ని సమాధులు ధ్వంసమై ఉన్నాయని, చరిత్ర కలిగిన సమాధులు, గుట్టలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.
డిస్కవరీ బృందం సభ్యులు కూన ప్రతాప్, గుండా ఓంకార్