సంక్షేమ హాస్టళ్లకు తాళాలు!
మహబూబాబాద్ అర్బన్: విద్యాసంవత్సరం ముగియకముందే సంక్షేమ హాస్టళ్లకు నిర్వాహకులు తాళాలు వేశారు. ప్రస్తుతం 5నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. కాగా విద్యార్థులు తోటి స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉండి గురువారం చివరి పరీక్ష సాంఘికశాస్త్రం రాసి మధ్యాహ్నం తమ ఇళ్లకు వెళ్లారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ఎస్సీ– ఈ, ఎస్సీ–సీ హాస్టళ్లు, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులోని బాలికల హాస్టల్, కేసముద్రం ఎస్సీ బాలుర హాస్టళ్లకు తాళాలు వేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సెలవులు ప్రకటించకుండానే వార్డెన్లు, వర్కర్లు ఇంటిబాట పట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈవిషయంపై ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం. నర్సింహస్వామిని వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ నెల 23నుంచి విద్యార్థులకు సెలవులు ఉన్నాయని, హాస్టళ్లకు తాళాలు వేస్తే, ఆ వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వేసవి సెలవులు
ప్రకటించక ముందే మూత
నిర్వహణలో వార్డెన్ల ఇష్టారాజ్యం


