
ముగ్గులను పరిశీలిస్తున్న శ్రద్దాశుక్లా
ఓటు హక్కు ప్రాధాన్యంపై మహిళలకు అవగాహన కలిగించేలా గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వివిధ శాఖల మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ శ్రద్దా శుక్లా ముగ్గులను పరిశీలించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
– హన్మకొండ అర్బన్
తలంబ్రాల బుకింగ్ గడువు పొడిగింపు
హన్మకొండ: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఈనెల 25 వరకు గడువు పెంచినట్లు ఆర్టీసీ కార్గో వరంగల్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా తలంబ్రాలు అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలంబ్రాల కోసం డిపోల వారీగా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. వరంగల్–1 డిపో 91542 98759, హనుమకొండ 91542 98761, జనగామ డిపో 91542 98762, పరకాల, భూపాలపల్లి డిపో 91542 98764, నర్సంపేట 91542 98763, తొర్రూరు 91542 98766, మహబూబాబాద్ 91542 98768, వరంగల్ రీజియన్ 93913 20465 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
గూడ్స్ షెడ్డు సమీపంలో అగ్నిప్రమాదం
కాశిబుగ్గ : వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్డు సమీపంలో గురువారం ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారుల కథనం ప్రకారం.. వరంగల్ తాత్కాలిక బస్టాండ్ వెనుక, వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్డు సమీపంలోని టేకు చెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై సమాచారం అందడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎవరో సిగరెట్ తాగి పడేయగా ఎండిన చెట్ల ఆకులకు అంటుకుని ఈ ఘటన జరిగిందని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీడీ, సిగరెట్ తాగి ఎక్కడ పడితే వేయొద్దన్నారు. కాగా, అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.