నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Published Thu, Apr 18 2024 9:55 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ - Sakshi

మహబూబాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 26న స్క్రూట్ని, 29న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందన్నారు.

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు..

మానుకోట పార్లమెంట్‌ పరిధిలో మానుకోట, డోర్నకల్‌, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. మొత్తం 15,30,367మంది ఓటర్లు ఉన్నారని, దీనిలో పురుష ఓటర్లు 7,46,982, మహిళా ఓటర్లు 7,83,280, ఇతరులు 105మంది ఉన్నారన్నారు. 1,158 ప్రాంతాల్లో 1,813 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల కార్యక్రమాలు..

పార్లమెంట్‌ పరిధిలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కొనసాగుతుందని ఎంసీసీ, ఇతర బృందాలు పని చేస్తున్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి చేశామన్నారు. హోం ఓటింగ్‌, పోస్టల్‌ ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు. కంట్రోలు రూం ఏర్పాటు చేశామని, స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మానుకోట, డోర్నకల్‌, నర్స ంపేట నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7నుంచి సాయంత్ర 5గంటల వరకు, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంట్‌ పరిధిలోని పది మంది ఓటర్లు బలపర్చాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి ఆర్వో రూంలోకి వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు. మూడు వాహనాలకు అనుమతి ఉంటుందని, మిగిలినవారు 100 మీటర్ల దూరంలోనే ఉండాలన్నారు.

44 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో 44 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్‌ తెలిపా రు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని, దివ్యాంగ ఓటర్ల కోసం ర్యాంప్‌ల నిర్మాణం చేయించామన్నారు. మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలతో పాటు మహిళా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు ఎస్పీ చెన్నయ్య మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికలు శాంతి యుత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పాల్గొన్నారు.

ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరణ

26న స్క్రూట్ని, 29వరకు ఉపసంహరణ

మే 13న పోలింగ్‌,

జూన్‌ 4న కౌంటింగ్‌ ప్రక్రియ

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం:

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

Advertisement
 
Advertisement