
గుంజేడు సమీపంలో కాలుతున్న అడవి
కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాలు అంటే పచ్చటి అడవులు, పక్షులు, అటవీ జంతువులతో ఆహ్లాదకరంగా ఉంటాయనుకుంటారు. కానీ వేసవి వచ్చిందంటే చాలు మిగతా ప్రాంతా ల కంటే భిన్నంగా అటవీ గ్రామాల్లో ఎక్కువ వేడి ఉంటుంది. చెట్లు ఆకులు రాల్చి మోడులు దర్శనమిస్తాయి. ఎక్కడ చిన్న నిప్పు రగిలినా అడవి మొత్తం మంటలు వ్యాపించి పొగలు కమ్ముకుంటాయి. కాగా ప్రస్తుతం అటవీ ప్రాంతాల్లో రోజుకోచోట మంటలు చెలరేగుతున్నాయి. దీంతో వాతావరణం వేడెక్కి.. గ్రామాల్లో ప్రజలు, అడవుల్లో జంతువులు ఎన్నడూ లేని విధంగా అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం రోడ్డెక్కేందుకు జనాలు జంకుతుంటే అడవుల్లో జంతువులు చుక్కనీరు దొరక్క సొమ్మసిల్లి పడిపోతున్నాయి.
మంటలు ఇలా..
అడవుల్లో మంటలకు పలు కారణాలు ఉన్నాయి. తునికాకు సేకరణ కోసం ముందుగా మోడెం కొట్టించాల్సి ఉంటుంది. అందుకోసం కాంట్రాక్టర్లకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. కాగా ఆ ఖర్చు తప్పించుకునేందుకు గ్రామస్తులలో కొందరితో ఒప్పందం కుదుర్చుకుని రహస్యంగా అటవీ దహనాలకు పాల్పడుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి.
సిబ్బంది ఎక్కడ..
అడవుల్లో మంటలను ఆర్పడంలో అటవీశాఖ సిబ్బంది విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడవుల్లో మంటలు రాకుండా ప్రత్యేక కార్యాచరణ, అందుకు నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల రేంజ్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవికి ముందే తగు నివేదికలు రూపొందించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సదరు అధికారులు ప్రాధాన్యత చూపలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అడవుల్లో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం అధునాతన బ్లోయర్ మిషన్లు సమకూర్చినా.. సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అంతరించిపోతున్న సంపద..
అడవుల దహనాల వల్ల ఎంతో విలువైన అటవీ సంపద అంతరించిపోతోంది. చిన్నచిన్న వన్య ప్రాణులు, పక్షులు మంటల్లో చిక్కుకుని మాడిపోతున్నాయి. ఎన్నో విలువైన ఆయుర్వేద మొక్కలు కాలిబూడిదవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి అడవిలో మంటలు చెలరేగకుండా చర్యలు తీసుకుని వేడి నుంచి కాపాడాలని అటవీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అటవీ దహనాలకు పాల్పడితే చర్యలు
అటవీ దహనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తునికాకు కాంట్రాక్టర్లు ఈ ఘటనలకు పాల్పడినట్లు తెలిస్తే కాంట్రాక్టు రద్దు చేయిస్తాం. మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటాం.
– చంద్రశేఖర్, ఎఫ్‌డీఓ
ఓవైపు ఎండలు..
మరోవైపు చెలరేగుతున్న మంటలు
వేడితో అల్లాడుతున్న ఏజెన్సీ ప్రజలు