
మల్లన్న నిజరూపదర్శనం కోసం భక్తుల బారులు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు ముందు ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే దృష్టి కుంభం ఆదివారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన మల్లికార్జునుడు, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలకు ఈనెల 11 నుంచి16వ తేదీ వరకు సుధావళి (వర్ణ లేపనం)పనులు పూర్తిచేశారు. ఆదివారం వేకువజామున ప్రధాన ఆలయం చుట్టూ బండారి, కుంకుమ చల్లుకుంటూ గుమ్మడి, నిమ్మకాయలతో బలిహరణ నిర్వహించారు. అర్చకులు వేద మంత్ర పఠనం చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రాతఃకాల బ్రహ్మముహూర్తంలో స్వామి, అమ్మవార్లకు రంగులు అద్దిన అతను నేత్రోన్మీలన(నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించడం) గావించిగా అర్చకులు, వేద పండితులు దృష్టికుంభం ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం మూల వరులను అలంకరించి గర్భాలయంలోని అర్ధప్రాణవట్టానికి పంచామృతాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసి మిగిలిన తంతు పూర్తి చేశారు. అనంతరం ఆర్జిత సేవలు, దైవదర్శనాలను పునరుద్ధరించారు. భక్తులు అధికసంఖ్యలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
దృష్టి దోషాలు తొలగుతాయి..
దృష్టికుంభం నిర్వహణతో దృష్టి దోషాలు తొలుగుతాయని ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, కీడు కలుగకూడదని పూర్వ ఆచారం ప్రకారం దృష్టికుంభం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతర ముందు నిర్వహించే ప్రధాన ఘట్టం ముగిసిందని చెప్పారు. ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్, వేద పారాయణ దారు గట్టు పురుషోత్తమ శర్మ, అర్చకులు మధు, భాను ప్రసాద్, నరేష్, మధు, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, నారాయణరావు, మధు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఐలోనిలో స్వామి, అమ్మవార్ల దర్శనం పునరుద్ధరణ

గర్భాలయం ఎదురుగా పోసిన అన్నపురాశి