పల్లెల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం

Nov 28 2026 1:02 AM | Updated on Nov 28 2026 1:02 AM

గెలుపొందిన సర్పంచులను

అభినందిస్తూ ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ ఒత్తిళ్లు... అధికారుల ఏకపక్ష మద్దతు... పోలీసుల బెదిరింపులు.. ఓటర్లకు డబ్బుల ఎర, ఇతరత్రా ప్రలోభాలు అన్నింటినీ అధిగమించి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లో గెలుపొందారు. ‘పచ్చ’ పార్టీతో పోటీ పడి విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు గ్రామ పంచాయ తీ ఓటర్లు ‘జయహో’ అంటూ అండగా నిలిచారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేసింది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

97 పంచాయతీల్లో ఘన విజయం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి దశలో 284 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 97 పంచాయతీల్లో ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లాలో 148 స్థానాలకు గాను 52 స్థానాల్లో, నంద్యాల జిల్లాలో 136 పంచాయతీలకు గాను 45 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన స్థానాల్లోనూ ఈ దఫా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో మొదటి దశలో పంచాయతీ ఎన్నికలు జరగగా, ఆదోనిలో 14, ఆలూరులో 36 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఆదోని నియోజకవర్గంలోని ఆదోని మండలం ఇస్వి, చింతకుంటతో పాటు పలు మేజర్‌ గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఆలూరు నియోజకవర్గంలోని 36 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నేరుగా విజయం సాధించగా సర్పంచులుగా గెలిచిన ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఇద్దరు వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారు. ఆలూరు హెడ్‌ క్వాటర్‌తో పాటు దేవనకొండ, తెర్నేకల్లు, చిప్పగిరి మండల కేంద్రాల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే గెలుపొందారు. వీటితో పాటు పలు మేజర్‌ పంచాయతీల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల గెలుపును అడ్డుకునేందుకు ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. పోలీసులను అడ్డుపెట్టి బెదిరింపులకు దిగారు. పలువురు అభ్యర్థులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అక్రమ కేసులు పెడతామని బెదిరించారు. అయినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఏమాత్రం బెదరక పోటీలో నిలిచారు. ఎమ్మెల్యే విరూపాక్షి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అండగా నిలిచారు. దీంతో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టారు. ఆలూరు గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు తొలుత 280 ఓట్లతో విజయం సాధించగా అధికారులపై వైకుంఠం జ్యోతి ఒత్తిడి తెచ్చి పలుమార్లు రీకౌంటింగ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఎస్పీ, ఇతర అధికారులు చివరకు 127 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు విజయం సాధించినట్లు ప్రకటించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో దేవనకొండ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వేదావతి తెర్నేకల్లు సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసి 2,047 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

నంద్యాల జిల్లాలో..

నంద్యాల నియోజకవర్గంలో 30 సర్పంచ్‌ స్థానాల్లో ఎన్నికలు జరగగా 13 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. రెండు ఏకగ్రీవాలతో కలిపి నియోజకవర్గంలో మొత్తం 15 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 80 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 29 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఒక ఏకగ్రీవంతో కలిపి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అధికార దుర్వినియోగానికి పాల్పడి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడినా ఈ నియోజకవర్గంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఘన విజయం సాధించడం విశేషం.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను

గెలిపించిన ప్రజలు

కర్నూలు జిల్లాలో

52 స్థానాల్లో విజయం

నంద్యాల జిల్లాలో

45 స్థానాల్లో గెలుపు

మండల కేంద్రాలు,

మేజర్‌ పంచాయతీల్లో జయకేతనం

పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement