నంద్యాల(అర్బన్): నంద్యాల మండలం కానాల గ్రామంలో గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ నాయకులు తొండాటకు యత్నించి గెలవాలని చూసి చిరవకు బిక్కమొహం వేశారు. గ్రామంలో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థిగా జగదీశ్వరరెడ్డి, టీడీపీ మద్దతు అభ్యర్థిగా పిట్టల మదార్‌సాలు పోటీలో ఉన్నారు. కౌంటింగ్‌లో భాగంగా ఒక్కో కట్టలో 50 బ్యాలెట్ పేపర్లు ఉండేలా సిబ్బంది కట్టకట్టారు. మూడు కట్టల ఫలితాల్లోనే వైఎస్సార్‌సీపీ మద్దతుదారుకు మెజార్టీ రావడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. ఆ తర్వాత కూడా మూడు కట్టలు టీడీపీ మద్దతుదారుకు వస్తే వైఎస్సార్‌సీపీ మద్దతుదారుకు ఆరేడు కట్టలు వస్తుండటం, మెజార్టీ పెరిగిపోతుండటంతో టీడీపీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. కౌంటింగ్ ఫలితాలు వైఎస్సార్‌సీపీకి పూర్తి అనుకూలంగా వస్తుండటంతో టీడీపీ నాయకులు, వారి అనుచరులు బ్యాలెట్ పత్రాలను పక్కనున్న ముళ్ల పొదల్లోకి విసిరేశారు. రికార్డు చేయాలని ఒకసారి, కట్టలు రీ కౌంటింగ్ చేయాలంటూ మరోసారి సిబ్బందిపై ఒత్తిడి పెంచడంతో పాటు విద్యుత్‌ను నిలిపివేసి కరెంట్ పోయిందంటూ టీడీపీ నాయకులు, ఏజెంట్లు హడావుడి చేశారు. తీరా ఏడు కట్టలను బయట ముళ్లకంపల్లోకి విసిరేసి మౌనంగా ఉండిపోయారు. బ్యాలెట్ కట్టలు కనిపించకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఎక్కడికి పోయాయంటూ ఆర్వో మునాఫ్‌ను నిలదీయగా తెలియదనే సమాధానం ఇచ్చారు. బయట ముళ్ల కంపల్లో విసిరేశారంటూ బయటి వ్యక్తులు తెలపడంతో టార్చ్‌లైట్ల వెలుతురులో వెతకగా ఏడు కట్టలు (350 ఓట్లు) తిరిగి కౌంటింగ్ చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి తనయుడు ఫిరోజ్ అక్కడికి చేరుకోగా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డగించేందుకు యత్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఎమ్మెల్సీ రాకతో ఫలితం ప్రకటన
వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అభ్యర్థి జగదీశ్వరరెడ్డి భారీ మెజార్టీలో ఉన్న అక్రమార్గాల ద్వారా ఫలితాల ప్రకటనలో జాప్యం చేస్తుండటాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా హుటాహుటినా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీ రాకను గమనించిన అధికారులు ఫలితాల ప్రకటనలో జాప్యం చేయకుండా వైఎస్సార్‌సీపీ మద్దతు దారుడు జగదీశ్వరరెడ్డి 553 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఆర్వో ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం, కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు హల్‌చల్ చేయడం, బ్యాలెట్ పత్రాలు అపహరించడం, ఆర్వో టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం వంటి వాటిపై చర్యలు ఉండవా.. అంటూ కానాల ప్రజలు, ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
కానాలలో ఫలితాలు మార్చేందుకు
కుట్రపన్నిన పచ్చనేతలు
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు
గెలిచినా రీకౌంట్ అంటూ హైడ్రామా
విద్యుత్ సరఫరా నిలిపేసి బ్యాలెట్
కట్టలు ముళ్లకంపల్లోకి విసిరేసిన వైనం


