కర్నూలు(సెంట్రల్): స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించి పింఛన్లు నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీఓలు/ఎంఈసీలు, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ అధికారులకు శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాలు ఇచ్చారు. బ్యాంకుల నుంచి పింఛన్ సొమ్మును 30వ తేదీన ఉపంసహరణ చేసుకొని అదే రోజు, ఆ మరుసటి రోజు అనగా డిసెంబర్ ఒకటో తేదీన రెండురోజుల్లో పంపిణీ చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.
మధ్యాహ్నం నుంచి పంపిణీ
ఈనెల 30న పింఛన్లను మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తారని, ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రావు సూచించారు. మిగిలిపోయిన వారికి డిసెంబర్ 1వ తేదీ పంపిణీ చేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో 2,31,717, నంద్యాల జిల్లాలో 2,08,144 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు చెప్పారు.
‘శ్రేష్ఠ’ కోసం దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): ‘శ్రేష్ఠ – 2027’ కింద ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ బాల బాలికలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు నవంబర్ 30వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన బాల బాలికలు 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2027 జనవరి 10వ తేదీన ఎన్‌టీఏ పరీక్షను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://exams.nta.nic.in/shreshta/,https:/ nta.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.24కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామికి హుండీల్లో కానుకల ద్వారా నగదు రూపంలో రూ.1,24,12,708 వచ్చినట్లుడిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. ఆలయంలోని హుండీల్లో రెండునెలలుగా భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించినట్లు చెప్పారు. బంగారం 30 గ్రాముల 60 మిల్లీ గ్రాములు, వెండి 12 కేజీల 900 గ్రాములు వచ్చిందన్నారు. యూఎస్ డాలర్‌లు 43, ఆస్ట్రేలియా డాలర్ 50 వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారిగా ఆదోని దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, దేవాలయ సిబ్బంది, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి పాల్గొన్నారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
సైనికుల సంక్షేమానికి విరాళాలు ఇవ్వాలి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(సెంట్రల్): సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 7న నిర్వహించనున్న కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన కార్ ఫ్లాగ్స్, స్టిక్కర్లను శుక్రవారం ఆమె ఆవిష్కరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములై, సైనిక కుటుంబాల సంక్షేమానికి విరాళాలు అందించాలని కోరారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. మహేంద్రమ్మ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సంజీవరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


