32 ఏళ్ల సేవను కమ్మేసిన చీకటి!
మంత్రాలయం: దాదాపు 30ఏళ్లుకు పైగా భక్తుల ఆకలితీరుస్తున్న అమావాస్య అన్నదాన సత్రం చుట్టూ చీకటి కమ్ముకుంది. టీడీపీ నేతల స్వలాభాపేక్షతో సాగుతున్న దోపిడీ కారణంగా మూడు అమావాస్యలుగా భక్తుల కడుపు నింపలేక మౌనంగా రోదిస్తోంది. జిల్లాలో డిప్యూటీ హోదా కలిగిన ఏకై క క్షేత్రం ఉరుకుంద లక్ష్మీ నారసింహ ఈరన్న ఆలయం. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని ఉరుకుంద గ్రామ సమీపంలో ఈ ఆలయం వెలసింది. శ్రావణమాసంలో 20 లక్షలకు పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రతి అమావాస్యకు 2–3 లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. ఒకప్పుడు క్షేత్రంలో భక్తులకు బుక్కెడు బువ్వ దొరకని రోజులవి. ఇంటి నుంచి సద్ది తీసుకెళ్లి స్వామి సేవలో తరించేవారు. ఈ పరిస్థితులను గమనించిన కోడుమూరు వాస్తువ్యులు అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా అమావాస్యకు వచ్చే భక్తుల కోసం ‘‘శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి అమావాస్య అన్నదాన సేవా సత్రం’’ పేరుతో సేవ చేస్తున్నారు. 32 ఏళ్లుగా భక్తుల ఆకలిదప్పులను తీరుస్తూ ఈ సత్రం మన్ననలు పొందింది. సేవను గుర్తించి అప్పటి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రాచోటి రామయ్య, ఈవో నరసింహులు సత్రం నిర్వాహకులు సరుకులు పెట్టుకునేందుకు రెండు గదులను సైతం కేటాయించారు. వీరి బృహత్కార్యాన్ని మెచ్చి ఈరన్న స్వామి భక్తుడు లక్ష్మీ పుత్రయ్య శెట్టి 20 సెంట్ల స్థలాన్ని సత్రానికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థలంలో భవనాన్ని నిర్మించి ప్రతి అమావాస్య రోజుతోపాటు శ్రావణమాసంలో భక్తులకు అన్నప్రసాద వితరణ గావిస్తున్నారు. ప్రతి అమావాస్య ముందు రోజు రాత్రి 3 వేలు, మరుసటి రోజు మధ్యాహ్నం 6 వేలు, రాత్రి 4వేల మంది భక్తులు ఇక్కడ భోజనాలు చేస్తారు. గంజహళ్లి, కనకవీడు పేట గ్రామాలకు చెందిన వంట మనుషులు సత్రంలో సేవ చేసుకుంటున్నారు. ఈ మూడు పూటలకు రూ.70 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. అమావాస్య రోజు మధ్యాహ్నం భక్ష్యాలతో భోజనాలు వడ్డిస్తుండటం విశేషం. ఇలాంటి సత్రంపై గ్రామ టీడీపీ నాయకులు పగ పెంచుకున్నారు. సత్రానికి భక్తులు ఇచ్చిన వంట సరుకులను ఎత్తుకెళ్తున్నారు. గత శ్రావణమాసంలో 35 బియ్యం మూటలను దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత భక్తులు ఇచ్చిన ప్రతి సరుకును ఎత్తుకెళ్తుండటంతో సత్రం నిర్వహణకు బ్రేక్ పడింది. సరుకులు తీసుకెళ్లడమే కాకుండా సత్రం నిర్వాహకులపై దౌర్జన్యం చేస్తున్నారు. ఫలితంగా నిర్వాహకులు అన్నప్రసాద వితరణను చాలించుకున్నారు. మూడు అమావాస్యలు గా సత్రంలో భోజనాలు నిలిచిపోవడం గమనార్హం.
టెండర్ పాడుకున్నామని దోపిడీ
భక్తులు స్వామికి మొక్కుబడిగా సమర్పించిన బియ్యం, బేడల పోగుకు సంబంధించిన టెండర్‌ను టీడీపీ నేతలు రూ.38 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఆ మేరకు టెండరుదారుల కళ్లు సత్రంపైనా పడ్డాయి. ఆలయంలో అన్నదానం నిర్వహించక ముందు నుంచే భక్తుల ఆకలి తీరుస్తున్న ఈ సత్రం స్వలాభాపేక్ష లేకుండా ముందుకు సాగుతోంది. ఇక్కడ భోజనం చేసిన భక్తులు తమకు తోచిన విధంగా బియ్యం, బ్యాళ్లు.. తృణమో ఫణమో ఇచ్చి వెళ్తున్నారు. భక్తులు ఇచ్చినవి ఏవైనా తమకే సొంతం అన్నట్లుగా టెండరుదారులు సత్రంలోనికి జొరబడి బియ్యం, బ్యాళ్లు ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది.
టీడీపీ పెద్దలకు మొరపెట్టుకున్నా..
టెండరుదారులు సత్రం తాళాలు తెరిపించి మరీ బియ్యం, బ్యాళ్లు ఎత్తుకెళ్తుండటంతో నిర్వాహకులు ఎదురుచెప్పలేక బెంబేలెత్తుతున్నారు. దాదాపు 30ఏళ్లుగా భక్తుల ఆకలితీరుస్తున్న సత్రం నేడు భక్తుల సేవలో తరించలేక మౌనంగా రోదిస్తోంది. ఇదే విషయాన్ని నిర్వాహకులు ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. టెండరుదారులు టీడీపీ వర్గీయులే కావడంతో ఏ ఒక్కరూ సత్రం నిర్వాహకులకు సహకరించని పరిస్థితి నెలకొంది.
అమావాస్య సత్రంలో
సరుకులు ఎత్తుకెళ్లిన టీడీపీ మూకలు
టెండరుదారుల దౌర్జన్యంతో
నిర్వాహకుల మౌనం
మూడు అమావాస్యలుగా భక్తులకు
నిలిచిన అన్నదానం
ఆలయ అన్నదానానికి ముందు నుంచే
సత్రం సేవ
భక్తుల కడుపు మాడుస్తున్న తమ్ముళ్లు


