135 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

135 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

135 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు

● మొత్తం ఓటర్లు 3,27,791 మంది

● 1,303 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు,

ఎన్నికల నిర్వహణకు 3,976

మంది పీఓ, ఓపీఓలు

● ఉదయం 7 నుంచి

మధ్యాహ్నం 1 గంట వరకు

పోలింగ్‌

● మధ్యాహ్నం 2 గంటల

నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

● పెద్ద గ్రామ పంచాయతీల్లో

హోరాహోరీ పోరు

బ్యాలెట్‌ బాక్సు, ఎన్నికల సామగ్రి తీసుకెళ్తున్న పోలింగ్‌ ఉద్యోగులు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం నేటి( గురువారం) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాలకు చెందిన 148 గ్రామ పంచాయతీల్లో సర్పంచు, 1,520 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కాగా, 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచు, 501 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో ప్రస్తుతం 135 గ్రామ పంచాయతీల్లో సర్పంచు, 1,005 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో మొత్తం ఓటర్లు 3,27,791 మంది కాగా.. ఇందులో పురుషులు 1,64,120, సీ్త్రలు 1,63,605, ఇతరులు 66 మంది ఉన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెంటనే ప్రకటించనున్నారు. పోలింగ్‌ నిర్వహణకు ఆయా గ్రామ పంచాయతీల్లో 1,303 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపునకు 1,423 మంది పీఓ, 2543 మంది ఓపీఓలతో పాటు స్థానిక సిబ్బందిని జిల్లా అధికార యంత్రాగం నియమించింది.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో

ప్రత్యేక నిఘా

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో 368 అత్యంత సమస్యాత్మక, 408 సమస్యాత్మక, 746 సాధారణ పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీ చేసేందుకు చర్యలు చేపట్టారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల ద్వారా కూడా వీడియోగ్రఫీ చేయనున్నారు.

పెద్ద పంచాయతీల్లో హోరాహోరీ పోరు

మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లోని పలు పెద్ద గ్రామ పంచాయతీల్లో నువ్వానేనా అనే రీతిలో పోటీ నెలకొంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆయా ప్రాంతాల్లో వివిధ రూపాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురి చేసినా, ఎక్కడా వారి బెదిరింపులకు భయపడకుండా నామినేషన్లు దాఖాలు చేసి బరిలో నిలిచారు. ముఖ్యంగా ఆదోని మండలం మండగిరి, పెద్ద హరివాణం, పెద్దతుంబళం, మదిర, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, బిల్లేకల్‌, జోహరాపురం గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల మధ్య రసవత్తర పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థిక, అంగబలాలతో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ మద్దతుదారులు తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఓటర్లకు విపరీతంగా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement