923 పింఛన్లు తొలగింపు! | - | Sakshi
Sakshi News home page

923 పింఛన్లు తొలగింపు!

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): డిసెంబర్‌ నెల పింఛన్లు 1వ తేదీనే పంపిణీ చేయనున్నారు. ఆ మేరకు నిధులను ఈ నెల 30న బ్యాంకులకు విడుదల చేయనున్నారు. నవంబర్‌ నెలలో ఉమ్మడి జిల్లాలో 4,40,784 పింఛన్లు ఉండగా.. డిసెంబర్‌ నెలకు సంబంధించి 4,39,861 పింఛన్లకు నిధులు మంజూరయ్యాయి. ఈ లెక్కన 923 పింఛన్లు కోత పెట్టడం గమనార్హం. కర్నూలు జిల్లాలో 2,31,717 పింఛన్లకు రూ.103.98 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,08,144 పింఛన్లకు రూ.90.84 కోట్లు మంజూరయ్యాయి.

నెలాఖరులోగా రైతులకు సవరించిన అడంగల్‌ కాపీలు

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో భూముల మ్యుటేషన్‌కు సంబంధించి ఆమోదించి సవరించిన అడంగల్‌ కాపీలను నెలాఖరులోగా రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా నేరుగా రైతుల ఇళ్లకే పంపుతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌, మ్యుటేషన్‌ ఫర్‌ కరెక్షన్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారికి తహసీల్దార్లు దరఖాస్తులను ఆమోదించిన వెంటనే సవరించిన అడంగల్‌ కాపీలను రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా అందజేసేలా చర్యలు తీసుకునేలా తహసీల్దార్లను ఆదేశించారు. మ్యుటేషన్‌ దరఖాస్తుల సమయంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లు దరఖాస్తుదారుల ప్రస్తుత నివాస చిరునామాను పూర్తి వివరాలతో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

శీతాకాలంలో పాల ఉత్పత్తిపై సర్వే

కర్నూలు(అగ్రికల్చర్‌): శీతాకాంలో పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిపై కేంద్రం ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ ర్యాండమ్‌గా గ్రామాలు, పట్టణాల్లో వార్డులు ఎంపిక చేసి పంపింది. ఆయా గ్రామాలు, వార్డుల్లోనే సర్వే కొనసాగనుంది. సర్వేకోసం ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లను జిల్లా పశుసంవర్ధక శాఖ నియమించింది. జిల్లాలోని సూగూరు, బురుజుల, రౌడూరు, కుంటనహాల్‌, ముద్దటమాగి, మార్లమడికి, వేముగోడు, డేగలహాల్‌, కమ్మరచేడు, చూడి, కల్లుదేవకుంట, సింగరాజనహల్లి, జొహరాపురం, నాగులదిన్నె, చెన్నంపల్లి గ్రామల్లో వింటర్‌ సీజన్‌ సర్వే చేపట్టినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. అదేవిధంగా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని 11, 16, 02, 21, 24, 13 వార్డులు, ఆదోని మున్సిపాలిటీలోని 17, 8, కర్నూలు అర్బన్‌లోని 17,27,42 వార్డుల్లో శీతాకాలంలో పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిపై సర్వే చేపట్టనున్నారు.

చెంచులకు ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని చెంచులకు కల్పించారు. తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ బుధవారం వివిధ గూడేలకు చెందిన 420 మంది చెంచు భక్తులు శ్రీశైలం వచ్చారు. వారికి ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌ నాయుడు, ఽఅధికారులు ఆహ్వానం పలికారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసిన అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement