కోడుమూరు ఎస్‌ఐ పుట్టినరోజు వేడుక వివాదాస్పదం
సాక్షి టాస్క్‌ఫోర్స్: క్రమశిక్షణకు మారుపేరు పోలీసు శాఖ. కానీ ఓ ఎస్‌ఐ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేరాలను కట్టడి చేసి నేరస్థులను జైలుకు పంపాల్సిన ఆ పోలీసు అధికారి రౌడీలతో కలసి నాలుగు రోజుల క్రితం జన్మదిన వేడుకల పేరుతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వీడియో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్నూలుకు 35 కిలోమీటర్ల దూరంలోని సమస్యాత్మక కోడుమూరు పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎర్రిస్వామి.. రౌడీషీటర్ ఎరుకల రవి, పాత నేరస్థులు ఎరుకల వీరేంద్ర, ఎరుకల మహేంద్ర, నేసె శివ, గంగాధర్ నాయుడు, హుసేన్, హెడ్ కానిస్టేబుల్ షఫిలతో కలసి జన్మదిన వేడుకల పేరుతో రోడ్డుపైనే బుల్లెట్ వాహనంపై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ‘శివమణి జిందాబాద్’ అనే నినాదాలు చేయించుకోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఓ బాధ్యత కలిగిన పోలీసు అధికారి ఇలా వ్యవహరించడంపై జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేరినట్లు సమాచారం.
ఒక వర్గానికి
కొమ్ము కాస్తున్నాడనే అపవాదు
ఇటీవల తెలుగుదేశం పార్టీ తరపున గంగాధర్ నాయుడు ఎంపీటీసీగా గెలుపొందారు. ఇతనిపై కూడా పలు కేసులు ఉన్నాయి. ఎరుకల వీరేంద్ర, ఎరుకల మహేంద్ర, ఎరుకల రవితో పాటు మరికొందరు పాత నేరస్థులు గంగాధర్ నాయుడుకు అనుచరులు. వీరంతా కలసి దౌర్జన్యాలు, పంచాయితీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే ఊరులో ఉంటున్న ఎరుకలి లింగన్న వర్గంతో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎరుకల లింగన్నను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో రెండు వర్గాల కదలికలపై నిఘా ఉంచాల్సిందిగా ఆదేశించారు. కానీ ఎస్‌ఐ ఎర్రిస్వామి.. గంగాధర్ నాయుడు వర్గానికి కొమ్ము కాస్తున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పలుమార్లు చార్జి మెమోలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆ అధికారి గంగాధర్ నాయుడు ఎంపీటీసీగా ఎన్నికై న సందర్భంగా జరుపుకున్న విజయోత్సవ వేడుకల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.
ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిపై
దాడికి కుట్ర
ఎస్‌ఐ కనుసన్నల్లోనే ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్ నాయుడు వర్గీయులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిపై దాడి చేసినట్లు పట్టణ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పట్టణంలో జాతర జరిగింది. అయితే పోలీసు అనుమతి లేకుండా ఎలా నిర్వహిస్తారంటూ ఎస్‌ఐ ఎర్రిస్వామి అడ్డు చెప్పడమే కాక రథయాత్రను అడ్డుకుని బూట్లతో రథంపైకి ఎక్కడం వివాదాస్పదమైంది. ఈ దృశ్యాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి చిత్రీకరించి ప్రసారం చేశాడు. ఘటనను మనసులో పెట్టుకుని ఎస్‌ఐ ఎర్రిస్వామి.. గంగాధర్ నాయుడు వర్గంతో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిపై దాడి చేయించినట్లు సమాచారం. దాడి దృశ్యాల సీసీ కెమెరాల ఫుటేజీ లేకుండా సదరు అధికారే మాయం చేయించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇన్‌చార్జ్ నాయకునికి జీ హుజూర్
మాకు వీళ్లే కావాలని నాయకులు అడగడం.. కాదనకుండా అధికారులు పోస్టింగ్ ఇచ్చేయడం పోలీసు శాఖలో ఎప్పుడూ జరిగేదే. కానీ పోస్టింగ్ కేటాయింపులో పట్టు కోల్పోతున్న ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడే కిందిస్థాయి అధికారులను నియంత్రించడంలోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారనే అపవాదు ఉంది. నియోజకవర్గ ఇన్‌చార్జి సిఫారసు మేరకు పోస్టింగ్ దక్కించుకున్న ఎస్‌ఐ ఎర్రిస్వామి ఆయన చెప్పిందే వేదంగా విధులు నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అడిగే వారు లేరన్నట్టుగా ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ప్రత్యర్థి వర్గంపై ప్రతాపం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.
రౌడీషీటర్లతో కలిసి
నడిరోడ్డులో కేక్ కటింగ్
‘శివమణి జిందాబాద్’ అంటూ
నినాదాలు
సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు


