నిబంధనల ప్రకారమే ఎంపీపీ పరోక్ష ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారమే ఎంపీపీ పరోక్ష ఎన్నికలు

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి

కర్నూలు(అర్బన్‌): జిల్లాలో ఈ నెల19వ తేదీన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జెడ్పీ సీఈఓ ఆర్‌ సుధాకర్‌రెడ్డితో కలిసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా మండలాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ, 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరిశీలన, మధ్యాహ్నం 12 గంటలలోపు అర్హత కలిగిన నామినేషన్లను ప్రకటించాలన్నారు. మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించాలన్నారు. కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నామినేషన్లను నిబంధనల ప్రకారం స్వీకరించాలన్నారు. ప్రతి నామినేషన్‌కు ఒక ప్రతిపాదకుడు, మరొక బలపరిచే సభ్యుడు ఉండాలని తెలిపారు. ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైతే సంబంధిత అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించవచ్చన్నారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు ఉంటే నిబంధనల ప్రకారం చేతులెత్తే విధానం ద్వారా ఎక్కువ మంది మద్దతు పొందిన అ భ్యర్థిని ఎన్నికై నట్లు ప్రకటించాలన్నారు. మధ్యాహ్నం 1గంటకు మండల పరిషత్‌ సమావేశం ప్రారంభించి, ముందుగా ప్రత్యక్షంగా ఎన్నికై న ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రమాణ స్వీకార పత్రాలను ఇప్పటికే మండలాలకు పంపించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

మండల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అర్హత కలిగిన ఎమ్మెల్సీలకు సమావేశ నోటీసులు అందజేయాలని కలెక్టర్‌ సూచించారు. అయితే ఓటు హక్కు ప్రత్యక్షంగా ఎన్నికై న ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ఉంటుందని, ఇతరులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా సమావేశానికి హాజరుకావచ్చని, వారికి ఓటు హక్కు ఉండబోదని స్పష్టం చేశారు. కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికతో పాటు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల సమావేశాలకు 50 శాతం కోరం తప్పనిసరిగా ఉండాలన్నారు. కోరం లేని పక్షంలో నిబంధనల ప్రకారం సమావేశాన్ని వాయిదా వేయాల్సి ఉంటుందన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సమావేశంలో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే చేతులెత్తే విధానం ద్వారా ఓటింగ్‌ నిర్వహించాలని, సమాన ఓట్లు వచ్చిన సందర్భంలో నిబంధనల ప్రకారం లాటరీ విధానాన్ని అనుసరించాలన్నారు. లాటరీ నిర్వహణలో ఒకే రంగు కలిగిన చీటీలను ఉపయోగించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా సమావేశ మందిరాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే 20వ తేదీన జిల్లా పరిషత్‌లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు, పత్తికొండ, ఆదోని ఆర్డీఓలు సందీప్‌ కుమార్‌, ఓబులేసు,అరుణ దేవి, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement