ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలి
● వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ● ఆటోడ్రైవర్లతో ప్రత్యేక సమావేశాలు ● కర్నూలులో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
కర్నూలు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అంతటా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమించిన వారిని గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో ని బంధనలు పాటిస్తున్న వారికి రోజాపూలు ఇచ్చి అభి నందిస్తున్నారు.ఆటోడ్రైవర్లకు నిబంధనలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించకూడ దని సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జరిగే పరిణామాల గురించి ఎల్‌ఈడీ స్క్రీన్‌పై గతంలో జరిగిన ప్రమాద సంఘటనలను చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
జిల్లాలో రెండు ప్రధాన జాతీయ రహదారులు వంద కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. వాహనదారులు కొందరు అపసవ్య దిశగా (ఎదురు) ప్రయాణిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ‘దారి మారకు.. హద్దు మీరకు’ అంటూ అవగాహన కల్పిస్తున్నారు. కర్నూలు నగరంలో స్పెషల్ డ్రైవ్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ముఖ్య కూడళ్లలో వాహనదారులను ఆపి రోడ్డు భద్రత నిబంధనలను వివరిస్తున్నారు. హోంగార్డు మొదలు ఇన్‌స్పెక్టర్ వరకు రహదారిపై ఉండి తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మోటారు వాహనాల నిబంధనలు పాటించాలి. లేకపోతే జరిమానా విధించి వాహనాలు సీజ్ చేస్తాం. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై, పెండింగ్ చలానాల సంఖ్య పెరిగిపోతోంది. జరిమానాలు విధిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. మళ్లీమళ్లీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. పెండింగ్ చలానాలు చెల్లించకపోతే వాహనం స్వాధీనం తప్పదు.
– మన్సూరుద్దీన్, ట్రాఫిక్ సీఐ
బాబూ... బండిపై ముగ్గురు వెళ్లొద్దు. మోటర్ వాహనాల చట్టంలోని 194 (సి) సెక్షన్ ప్రకారం భారీ జరిమానా తప్పదు. కొత్త చట్టం ప్రకారం మూడు నెలల జైలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది జాగ్రత్త! – ఓ ద్విచక్ర వాహనదారుడికి
ట్రాఫిక్ పోలీసు అధికారి హెచ్చరిక.
అత్యవసరమైనా సరే మైనర్‌కు వాహనం అప్పగించొద్దు. తనిఖీల్లో దొరికినా, సీసీ కెమెరాలకు చిక్కినా రూ.25 వేలు జరిమానాతో పాటు వాహనమిచ్చిన వారికి జైలు శిక్ష తప్పదు. కొత్త చట్టం ప్రకారం బాలలు కూడా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– మైనర్ బాలుడికి వాహనమిచ్చిన తండ్రికి పోలీసులు కౌన్సెలింగ్‌లో సున్నితమైన హెచ్చరిక
పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తే ప్రతి అదనపు ప్రయాణికుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. – ఆటోవాలాకు పోలీసు హితబోధ.
.. ఇలా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల గురించి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు, హితబోధ చేస్తున్నా ఫలితం మారడం లేదు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.


