మేం జూసుకుంటం | - | Sakshi
Sakshi News home page

మేం జూసుకుంటం

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● ఓట్లన్నీ గంపగుత్తుగా మనకే పడాల ● అభ్యర్థుల పోటాపోటీ ప్రయత్నాలు ● మందు, విందుతో ఎర ● ఐటీ ఉద్యోగులకు ఫోన్లలో పలకరింపు

నీకేంకావల్నో చెప్పు..
● ఓట్లన్నీ గంపగుత్తుగా మనకే పడాల ● అభ్యర్థుల పోటాపోటీ ప్రయత్నాలు ● మందు, విందుతో ఎర ● ఐటీ ఉద్యోగులకు ఫోన్లలో పలకరింపు

ఆళ్లగడ్డ: పల్లె పోరుకు ఎన్నికల నగారా మోగడంతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సర్పంచు బరిలో నిలవాలనుకుంటున్న ఆశావహు లు ఇప్పటి నుంచే ఓటర్లును.. ముఖ్యంగా యువత ను తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యారు. గత నాలుగైదు రోజులుగా ఏ ఊరిలో చూసినా, ఎదురుగా కనిపించినా వారితో నేరుగా మాట్లాడటంతో, వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని ఫోన్లలో అభ్య ర్థుల ఆప్యాయపు పలకరింపులే వినిపిస్తున్నాయి. ‘ఏ రా .. ఎట్లున్నవ్‌.. అక్కయ్యా.. పిల్లలు బాగున్నారా ? ఏం చేస్తున్నారు ? సరే ఈ దఫా మనమే ప్రసిడెంట్‌గా పోటీ చేస్తున్నాం. ఈ సారి మీ ఓట్లు అన్నీ మనకే వేయాలి. నీతో పాటు నీ ఫ్రెండ్స్‌, చుట్టాలు, దాయాదులు అందరి ఓట్లు కచ్చితంగా వేయించే బాధ్యత నీదే. ముందుండి అన్నీ చూసుకోవాలి. ఓట్లన్నీ గంపగుత్తుగా మనకే పడాలా.. సోషల్‌ మీడియాలో మన పార్టీ హోరెత్తించాలి’ అంటూ యువతపై బాధ్యతలు పెడుతున్నారు.

పోటాపోటీగా విందులు..

నామినేషన్లు కూడా మొదలవ్వనే లేదు. అయినా యువతను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా విందులు, తాయిలాల వల విసురుతున్నారు. గతంలో అతనికి, ఆ కుటుంబాలకు చేసిన మంచిని వివరిస్తున్నారు. ఏదైనా అసంతృప్తి ఉంటే దానికి సంజాయిషీలు చెప్పుకుంటున్నారు. ఇక మీదట అలా జరక్కుండా చూసుకుంటానని ప్రమాణాలు చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు మందు, విందులతో ఆకట్టుకునేందుకు ఆరాట పడుతనన్నారు.

ఓట్ల రోజు ఊరికి రావాల్సిందే..

స్థానికంగా ఉండే యువతతో పాటు ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో, ఐటీ సెక్టార్లలో పనిచేస్తున్న వారిని కూడా అభ్యర్థులు ఫోన్లలో పలకరిస్తున్నారు. యోగక్షేమాలు అడుగుతూనే ఓట్ల రోజు కచ్చితంగా ఊరికి రావాలని పిలుపు నిస్తున్నారు. ఈ సారి మనమే పోటీ చేస్తున్నాం. మన బలం చూపించాలి. మీ యన్న.. తమ్ముడు వాళ్ల వెంట పోతున్నట్లుగా ఉంది. వాళ్లకు కొంచెం చెప్పు మనం మనం ఒకటి.. అంటూ గతంలో చేసిన పనులను వివరిస్తూ.. ‘అవతలి వాడు అప్పుడు నాకు పలకలేదు.. అంటే దానికి సమాధానంగా అప్పుడు వాడు అడ్డుపడటంతో చేయలేక పోయాను.. ఇక మీదట అలా జరగదులే’ అంటూ సంజాయిషీ చెప్పుకుంటున్నారు. మొత్తం మీద సర్పంచ్‌ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు పడుతున్న పాట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది చూసిన కొందరు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడని అనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement