కర్నూలు(సెంట్రల్): జిల్లాలో మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి జిల్లా కలెక్టర్ నార్కో కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా పాఠశాల, కళాశాలల స్థాయిలో విస్తత అవగాహన చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనారోగ్య సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తుపై పడే ప్రభావం, కుటుంబాలపై కలిగే దుష్పరిణామాలను వివరించాలని సూచించారు. కర్నూలు నగరంలోని జొహరాపురం రోడ్డు, ఫిష్ ఏరియా, బంగారుపేట తదితర ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో గుర్తించిన 30 డార్క్ స్పాట్లలో అవసరమైన లైటింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటివరకు 9 కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించామని, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా లాడ్జీలు, హోటళ్లు, ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ నెలలో మాదకద్రవ్యాలకు సంబంధించిన మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. సమావేశంలో డిటిసి శాంతకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డి ఈ ఓ సుధాకర్ పాల్గొన్నారు.


