కర్నూలు(అగ్రికల్చర్): సహకార ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు వచ్చిన నేపధ్యంతో ఉమ్మడి జిల్లా సహకార అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. తాజాగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. చివరిసారిగా 2013లో సహకార ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ప్రస్తుతం సహకార శాఖ అసిస్టెంటు రిజిస్టార్లు, సీనియర్ ఇన్స్‌పెక్టర్లు, ఆడిటర్లు పరిశీలిస్తున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలనే ప్రస్తుత ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు కర్నూలు జిల్లాలో 43 సంఘాలు ఉండగా... 76 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. నంద్యాల జిల్లాలో 86 వేలకుపైగా సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం రైతులతో ఈ–కేవైసీ చేయిస్తున్నారు. ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన అవసరాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలిం్స ఉండగా... ఆ దిశగా చర్యలు లేకపోవడం గమానార్హం. మరోవైపు కొత్త సభ్యులను కూడా నమోదు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘానికి ఒక పోలింగ్ లొకేషన్‌లను గుర్తించారు. ఈ లొకేషన్‌లలో 300 నుంచి 500 మంది సభ్యులకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. కొత్త సభ్యుల సంఖ్యను బట్టి పోలింగ్ లోకేషన్‌లు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అవుతాయని సహకార అధికారులు తెలిపారు.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.2.76 కోట్లు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం రూ.2,76,62,955 సమకూరింది. బుధవారం స్థానిక రాజాంగణ భవనంలో (23.10.2026 నుంచి 10.11.2026) 19 రోజులకు సంబంధించి కానుకలు లెక్కించారు. అందులో నగదు రూపేణా రూ.2,68,66,655 రాగా నాణేలా రూపంలో 7,96,300 వచ్చింది. ఇక 49 గ్రాముల బంగారం, 680 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరినట్లు మేనేజర్ ఎస్‌కే. శ్రీనివాసరావు తెలిపారు.
వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చారని గుడిసె తొలగింపు
ఎమ్మిగనూరుటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండా పట్టుకొని జైకొట్టినందుకు ఓ నిరుపేద తన ఇంటిముందు వేసుకొన్న షెడ్డును మున్సిపల్ అధికారులు తొలగించారు. శివన్న నగర్‌లోని ఎస్సీ హస్టల్ వద్ద తన ఇంటి ముందు 15 ఏళ్ల క్రితం రేకుల షెడ్డు వేసుకున్నానని, అయితే రాజకీయ కక్షతో తొలగించడం బాధ కలిగించిందని షఫితాత ఆవేదన వ్యక్తం చేశాడు. షెడ్డుకు సంబంధించి మున్సిపాలిటీకి ఏటా పన్ను చెల్లిస్తున్నా కనికరించకుండా బుధవారం ఉదయమే మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో వచ్చి షెడ్డును తొలగించారని వాపోయాడు. దీంతో తాను ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్నాడు. రాజకీయాలు ఎన్నికల వరకు ఉండాలే కానీ ఇలాంటి కక్షపూరిత చర్యలు ఎవరికీ మంచిది కాదన్నారు.
క్వింటా వేరుశనగ రూ.7,890
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో బుధవారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.7,890 ధర పలికింది. మార్కెట్‌కు 9 క్వింటా ళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.4,690, మధ్యస్థ ధర రూ.6,290 ప్రకారం మార్కెట్‌లో వ్యాపారు లు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. అదేవిధంగా 4క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా క్వింటా గరిష్ట ధర రూ.7,481 పలికిందన్నారు.
శ్రీశైల దేవస్థానానికి
రూ.4లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ, గోసంరక్షణనిధి, ప్రాణధాన ట్రస్ట్ పథకానికి పలువురు భక్తులు రూ.4లక్షల విరాళాలను అందించారు. బుధవారం హైదరాబాద్‌కు చెందిన కె.ఆర్.సుధాకర్‌రావు అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,001 విరాళాన్ని, గోసంరక్షణనిధి పథకానికి రూ.1,00,001 విరాళాన్ని, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1,00,001విరాళాన్ని అందించారు. అలాగే ఒంగోలుకు చెందిన బి.శ్రీనివాసరావు అన్నప్రసాద వితరణ పథకానికి రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్‌కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను సత్కరించారు.


