కర్నూలు(సెంట్రల్): మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, దాని మిత్రపక్షాలు చేసిన అక్రమాలు, అరాచకాలపై విచారణ జరపాలని సీపీఎం, సీపీఐ డిమాండ్ చేశాయి. పోలీసులతో ప్రతిపక్ష పార్టీ నాయకులను భయపెట్టి కూటమి నాయకులు గెలుపొందారని, అసలు అది విజయమే కాదని, ఫోజులు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక ఎన్నికలలో కూటమి పార్టీలు చేసిన అక్రమాలకు నిరసనగా కర్నూలు నగరంలో ధర్నా చౌక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నిరసనలో నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాల్సిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు కూటమి పార్టీల కొమ్ము కాశాయని ఆరోపించారు. పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం, పోలింగ్ ఏజెంట్లు కూర్చోకుండా అడ్డుకోవడంతోనే కూటమి పార్టీలు రిగ్గింగ్, సైక్లింగ్‌కు పాల్పడ్డాయన్నారు. ఇంత జరిగినా నిస్సిగ్గుగా చంద్రబాబునాయుడు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని చెప్పడం అన్యాయమన్నారు.


