కర్నూలు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు నంద్యాల జిల్లా లోని పాఠశాలల్లో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు ఈ కార్యక్రమాన్ని విరివిగా నిర్వహించాలని కోరారు. సురక్షిత బాల్యం, బాలల సంరక్షణ ఉద్యమం అనే పాన్ ఇండియా స్కూల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ ఆవిష్కరించిందని తెలిపారు. ఈ మేరకు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పిల్లలకు సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్‌ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.
నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 21న స్పెషల్ లోక్ అదాలత్ జరుగుతుందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించి చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరిస్తామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కోర్టుల్లో ప్రతి రోజూ జరిగే ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగులలో కక్షిదారులు చెక్‌బౌన్స్ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.


