ఆళ్లగడ్డ: వ్యక్తిపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడిచేసి నరికిన సంఘటన మంగళవారం మండలంలోని ఆర్.కృష్ణాపురం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆర్.కృష్ణాపురం ఎస్సీ కాలనీలో నివాసముండే జకిరయ్య కుటుంబానికి, అదే కాలనీకి చెందిన యోహాన్ కుటుంబానికి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఓ యువకుడిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం జకిరయ్య ఇంటి వద్ద ఉండగా యోహాన్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసి గొడ్డలితో నరికారు. జకిరయ్య ప్రాణభయంతో గట్టిగా కేకలు వేస్తూ రక్తపు మడుగులో పడిపోయాడు. ఇరుగు పొరుగు వారు గాయపడిన జకిరయ్యను 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు


