పీఏసీఎస్‌లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో పాగా వేసేందుకు టీడీపీ కుట్రలు
ఈ నెల 6 నుంచే సభ్యత్వ నమోదుకు అవకాశం
15 రోజుల పాటు సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు
ఈ–కేవైసీ పేరుతో వైఎస్సార్‌సీపీ అనుకూలుర నభ్యత్వంపై వేటు
ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు
కర్నూలు(అగ్రికల్చర్): అర్బన్ లోకల్ బాడీస్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు చేయని అరాచకం లేదు. వైఎసార్‌సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా దౌర్జన్యకాండ నిర్వహించారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలో సాగించిన అక్రమాలు అన్నీ, ఇన్నీ కావు. పోలింగ్ రోజు సాగించిన అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. పోలింగ్ బూతులను ఆక్రమించడం, ఓటర్లు రాకుండా అడ్డుకోవడం. అక్రమాలకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. అన్నింటినీ చేసి గెలిచాం అనిపించుకుంది. అదే తరహాలో సహకార ఎన్నికలు కూడా నిర్వహించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో తిష్ట వేయడానికి కసరత్తు మొదలు పెట్టింది. పీఏసీఎస్‌ల్లో ఒకవైపు ఈ–కేవైసీ పేరుతో వైఎస్సార్‌సీపీకి అనుకూలమని భావించే రైతులపై అనర్హత వేటు వేయడం, కొత్త సభ్యత్వం పేరుతో టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరులు, కార్యకర్తలను నమోదు చేయించే కార్యక్రమం మొదలైంది.
గుట్టుగా సభ్యత్వ నమోదు
సహకార సంఘాల్లో కొత్త సభ్యత్వం పొందేందుకు సహకార శాఖ ఈ నెల 6వ తేదీ నుంచే అవకాశం కల్పించింది. అయితే ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లా సహకార శాఖ అధికారులు ఈ విషయం బయటికి పొక్కనీయకుండా ఒక పథకం ప్రకారం సభ్యత్వ నమోదు చేపట్టారు. సభ్యత్వం ఉన్న రైతులందరికీ ఓటు హక్కు ఉంటుంది. కర్నూలు జిల్లాలో 43, నంద్యాల జిల్లాలో 56 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఇప్పటివరకు సంఘాల్లో సభ్యత్వం ఉన్న రైతులతో ఈ–కేవైసీ చేయిస్తోంది. ఈ–కేవైసీ ద్వారా వైఎస్సార్‌సీపీ అనుకూలురుగా భావించే రైతులను పక్కన పెడుతుండటం గమనార్హం. మరోవైపు కొత్త సభ్యత్వ నమోదు ఏకపక్షంగా జరుగుతోంది. సహకార సంఘాల్లో సభ్యత్వం పొందాలంటే విధిగా పొలం ఉండాలి. పొలం ఎక్కడ ఉందో అక్కడి సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. సభ్యత్వ నమోదు ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఆధార్ ఆధారంగా సభ్యత్వ నమోదు చేపడుతారు. సభ్యత్వం పొందాలంటే రైతు పేరుమీద పొలం ఉండటంతో పాటు కనీసం రూ.300 షేర్‌క్యాపిటల్ చెల్లించాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాన్యువల్‌గా ఎట్టి పరిస్థితుల్లో చేపట్టరాదని, నెట్‌వర్క్ సమస్యలు ఉంటే ఉదయం, రాత్రి వేళల్లో నమోదు చేయాలని సహకార శాఖ రిజిస్ట్రార్ ఆదేశించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15 రోజులు సభ్యత్వ నమోదుకు అవకాశం కల్పించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లను స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ వర్గాలు అప్పుడే కసరత్తు చేపట్టాయి. సభ్యత్వ నమోదుకు సంబంధిత సహకార సంఘం సీఈఓలను రైతులు సంప్రదించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.


