ఆదోని అర్బన్: పట్టణంలోని కోటఅశ్వర్థ నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆటోకు నిప్పంటించారు. లక్ష్మిరెడ్డికి చెందిన ఆటోను ఇంటి ముందు పార్కింగ్ చేయగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగులు నిప్పంటించారు. చుట్టుపక్కల వారు యజమానికి సమాచారం ఇవ్వగా ఆయన బయటికి వచ్చేలోపే ఆటో పూర్తిగా కాలిపోయింది. రోజూ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, తనకు శత్రువులు లేరని, గతంలో కూడా ఆటో టైర్లు, బ్యాటరీని ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయారు. రూ.4.50 లక్షలకు ఫైనాన్స్‌లో ఆటోను తీసుకొని నడుపుకుంటూ వాయిదాలు కడుతున్నానని, ఇంకా రూ.1.50 లక్షలు మిగిలి ఉందని ఆవేదనకు గురయ్యారు. ఆటోకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఘటనపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నారు.
లెక్చరర్ ఆత్మహత్య
బొమ్మలసత్రం: నంద్యాల మండలం రైతునగరం గ్రామ శివారులో లెక్చరర్ చంద్రమౌళీశ్వరరెడ్డి (52) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. తాలుకా సీఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాల మేరకూ రైతునగరం సమీపంలోని గురుదత్త కాలనీలో నివసిస్తున్న చంద్రమౌళీశ్వరరెడ్డి పట్టణంలోని వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అవసరాల నిమిత్తం కొందరు వ్యక్తుల వద్ద రూ.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు చంద్రమౌళీశ్వరరెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతిచెందాడు. భార్య లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడికి జోశ్వని అనే కుమార్తె ఉంది.


