● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
బొమ్మలసత్రం: ఆళ్లగడ్డలో శాంతి భద్రతలను రక్షించడంలో అక్కడి పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన వుసేన్‌బాషా ఇంటి ముందున్న కార్లను కొందరు టీడీపీ గూండాలు దగ్ధం చేయడంపై కాటసాని, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డిలు శనివారం ఎస్పీ సునీల్‌షోరాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో వుస్సేన్‌బాషా చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులు హెచ్చుమీరాయన్నారు. మూడు రోజుల క్రితం ఆయన కుమారుడిపై కత్తులతో హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి రాగానే రాత్రి కొందరు టీడీపీ గూండాలు ఇంటి ముందున్న కార్లకు నిప్పుపెట్టి బెదిరింపులకు దిగడం జరిగిందన్నారు. దీనిపై సీఐకు ఫిర్యాదు చేస్తే మంచి నాణ్యమైన సీసీ కెమెరా అమర్చుకోమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు వెటకారంగా మాట్లాడే బదులు యూనిఫామ్ తీసేసి ఉద్యోగానికి రాజీనామా చేయటం మంచిదన్నారు. శాంతిభద్రతలు రక్షించి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దాడులకు పాల్పడే వారికి అండగా నిలబడటం దుర్మార్గమన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. బాధితులకు రక్షణ కల్పించి వారికి న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీని కోరామన్నారు.


