కోవెలకుంట్ల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఓ వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఆటోలో తీసుకొచ్చి ఆసుపత్రిలో వదిలి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది శనివారం ఆ వృద్ధుడిని వివరాలు ఆడుగగా తన పేరు కృష్ణారెడ్డి అని కోవెలకుంట్ల పట్టణంలోని బొల్లవరం వీధి అని అతికష్టం మీద చెబుతున్నాడు. వైద్యసిబ్బంది ఆ కాలనీకి వెళ్లి విచారించినా కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ తెలియడం లేదు. వృద్ధుడికి నడుము వద్ద ఇన్షెక్షన్ అయి రక్తస్రావం అవుతుండటంతోపాటు నిలబడలేని స్థితిలో ఉన్నాడు. వైద్య సిబ్బంది సైలెన్ బాటిల్ పెట్టి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వృద్ధుడి కుటుంబ సభ్యులు గుర్తించి ఇంటికి తీసుకెళ్లాలని అక్కడ వైద్య సిబ్బంది తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పత్తికొండ/పత్తికొండ రూరల్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన శనివారం పత్తికొండలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఆంజినేయనగర్‌లో లక్ష్మిదేవి, నరసింహులు దంపతుల కుమార్తె మహేశ్వరిని ఆరు నెలల కిందట ఆస్పరి మండలం తురువగల్లు గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇచ్చి వివాహం జరిపించారు. అక్కడ కుటుంబ కలహాలతో భార్యాభర్తలను పత్తికొండ పట్టణంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఉదయం ఆలస్యమైనా ఇంటి తలుపు తెరవలేదని కుటుంబ సభ్యులు అనుమానంతో ఇంటిని పరిశీలించారు. ఉరివేసుకుని వేలాడుతున్న మహేశ్వరి(20) మృతదేహాన్ని గమనించారు. భర్త ఇంటి దగ్గర లేకపోవడంతో ఉరివేసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజరావు తెలిపారు.
బొమ్మలసత్రం: పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ ఫంక్షన్‌హాల్‌పై ఉన్న గదిలో యువ పురోహితుడు భగవాన్‌శర్మ (23) ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రా మానికి చెందిన విశ్వేశ్వరరావు కుమారుడు భగవాన్‌శర్మ పట్టణంలోని క్రాంతినగర్‌లో నివాసముంటున్నారు. గత ఆరు నెలలుగా రోజకుంట వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పురోహితునిగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో రాత్రి పక్కనే ఉన్న ఎస్‌ఎల్‌వీ ఫంక్షన్‌హాల్‌పై ఉన్న గదిలో నిద్రించేవాడు. ఉదయం స్థానికులు భగవాన్‌శర్మ ఉరివేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఎవరో హత్యచేసి తాడుకు వేలడదీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
డోన్ టౌన్: పట్టణంలోని కృష్ణా లాడ్జి వెనుక వీధిలో నివాసం ఉంటున్న రాజశేఖర్(31) రైలు కిందపడి మృతిచెందాడు. కర్నూలు రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఆటో నడుపుతూ జీవనం సాగించే రాజశేఖర్ మృతదేశం శుక్రవారం రాత్రి పట్టణ సమీపంలోని వెంకటనాయునిపల్లె గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడివుండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడ వెళ్లే వందే భారత్ ట్రైన్ కింద పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? ప్రమాదవశాత్తూ మృతిచెందాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. మృతునికి భార్య శ్రావణితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కర్నూలు రైల్వే పోలీసులు తెలిపారు.


