కర్నూలు(అగ్రికల్చర్): వరిలో అగ్గి తెగులు ఎక్కువగా కనిపిస్తోందని, ఈ తెగులు నివారణకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ తెలిపారు. శనివారం జిల్లాలోని వేముగోడు, గోనెగండ్ల, మునగాలపాడు, జి.సింగవరం గ్రామాల్లో వరి పంటను పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో అగ్గి తెగులు తీవ్రతను గుర్తించామని, దీనిని రైతులు నిర్లక్ష్యం చేస్తే నష్టపోవాల్సి ఉంటుందన్నారు. తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 75 శాతం ఎకరాకు 120 గ్రాములు లేదా ఐసోప్రొతియోలేన్ 40 శాతం ఎకరాకు 300 ఎంఎల్ లేదా , కాసుగా మైసిన్ 3 శాతం ఎకరాకు 500 ఎంఎల్ పిచికారీ చేసి నివారించుకోవచ్చన్నారు. అగ్గి తెగులు ఆశించిన పంటపై ముదురు గోధుమ రంగు అంచులో.. మధ్యలో బూడిదరంగు గల నూలుకండె ఆకారపు మచ్చలు వస్తాయన్నారు. తెగులు తీవ్రమైనపుడు ఆకులు ఎండిపోయి తగులబడినట్లుగా కనిపిస్తాయన్నారు. పిలకల కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద విరిగి పిలక వాడిపోతుందన్నారు. వెన్నులు ఏర్పడిన తర్వాత మెడ భాగంలో తెగులు ఆశిస్తే వెన్నులు విరిగి కిందకు వాలిపోతాయన్నారు. ఫలితంగా వెన్నులో తాలు లేదా సగం నిండిన గింజలు ఏర్పడుతాయన్నారు.


