● ఆర్‌యూ స్థాయి డిగ్రీ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
కర్నూలు(టౌన్): విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలల డీన్ శౌరీలు రెడ్డి అన్నారు. శనివారం స్థానిక సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రాయలసీమ యూనివర్సీటీ స్థాయి డిగ్రీ కళాశాలల క్రీడా పోటీల్లో భాగంగా ఖో–ఖో, కబడ్డీ, హ్యాండ్ బాల్ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శాంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ యూనివర్సీటీ స్థాయి మహిళల క్రీడా పోటీల్లో 250 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమన్నారు. రాయలసీమ యూనివర్సీటీ క్రీడల కోఆర్డినేటర్ డాక్టర్ శివకిషోర్ మాట్లాడుతూ ప్రతిరోజు క్రీడల్లో సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సాఽధిస్తారన్నారు. కార్యక్రమంలో పోటీల నిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వర్లు, నరసప్ప, ఇమ్రాన్ బాషా, పీఈటీలు పాల్గొన్నారు.


