పత్తికొండ రూరల్: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. హోసూరులోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న పార్టీ నాయకుడు బనగాని శ్రీనివాసులును సీఐ జయన్న దండించారు. తరువాత ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగా అక్రమంగా అరెస్టుకు యత్నించారు. అధికారపార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఒక వర్గం వారిని వెళ్లిపోవాలని సూచించడం సరైంది కాదని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎందుకు అరెస్టు చేస్తారో చెప్పాలని సీఐని నిలదీశారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గుంపులుగా గ్రామస్తులు రావడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు అకారణంగా అలజడి సృష్టించి భయానక వాతావరణాన్ని సృష్టించారని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వాపోయారు. అలాగే పందికోనలో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా పోలింగ్ కేంద్రంలో నుంచి ఏజెంట్లను బయటకు పంపించారు. తరువాత ఇరువర్గాల వారికి వాగ్వాదం జరిగింది. గ్రామపెద్దలు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


