కౌంటింగ్‌ అక్రమాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ అక్రమాలపై హైకోర్టును ఆశ్రయిస్తాం

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

● మంత్రి టీజీ భరత్‌కు దమ్ముంటే 23 వార్డులో రీపోలింగ్‌, రీకౌంటింగ్‌ నిర్వహించాలి ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి

● మంత్రి టీజీ భరత్‌కు దమ్ముంటే 23 వార్డులో రీపోలింగ్‌, రీకౌంటింగ్‌ నిర్వహించాలి ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలు (టౌన్‌): కౌంటింగ్‌లో అనేక అక్రమాలు చేపట్టారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, హైకోర్టును ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. అవసరమైతే సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లి అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఎన్నికల అధికారులపై శిక్ష పడేంత వరకు వదిలేదని హెచ్చరించారు. కర్నూలులోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఏజెంటుగా మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు వ్యవహరించారని ఎస్వీ విమర్శించారు. రిటర్నింగ్‌ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి విజయాన్ని సాధించిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను కాదని టీడీపీకి డిక్లరేషన్‌ ఇప్పించారన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 50, 52, 23 వార్డుల్లో గెలిచినా రీకౌంటింగ్‌ పేరుతో తిరస్కరణకు గురైన ఓట్లను కలిపేసి టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఇలా అనేక వార్డుల్లో దౌర్జన్యం.. దుర్మార్గం చేశారన్నారు. మంత్రి టీజీ భరత్‌కు దమ్ముంటే 23వ వార్డులో రీపోలింగ్‌, రీకౌంటింగ్‌కు ముందుకు వస్తారా.. అని సవాల్‌విసిరారు. దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేసిన అధికార పార్టీకి ఎదురొడ్డి నిలిచి గెలిచిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ఎస్వీ అభినందనలు తెలిపారు.

ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ.. కర్నూలు కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నుంచి ఫలితాలు వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులతో బెదిరించారన్నారు. మంత్రి ప్రోద్బలంతోనే కమిషనర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కర్నూలు నగర వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి సుశీల మాట్లాడుతూ.. రెండున్నరేళ్లలో నిర్వహించిన ఎన్నికల్లో తనకు లక్ష ఓట్లు వచ్చాయని, ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. కర్నూలు పాతబస్తీని లక్ష్యంగా చేసుకొని అభ్యర్థులపై, బంధువులపై మంత్రి టీజీ భరత్‌ అక్రమ కేసులు నమోదు చేయించారన్నారు. అయినా 11 మంది కార్పొరేటర్లు గెలిచారన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా 15వ వార్డులో వైఎస్సార్‌సీపీ కార్పొరేటరే గెలిచారన్నారు. వచ్చే 2029 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమన్నారు.

పోలీసులతో బెదిరించారు

వైఎస్సార్‌సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహమ్మద్‌ ఆలీఖాన్‌ మాట్లాడుతూ.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో పోలింగ్‌ రోజు వైఎస్సార్‌సీపీ నేతలను గృహ నిర్భందం చేశారన్నారు. పొలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. 23వ వార్డు అభ్యర్థి వెంకటరమణ మాట్లాడుతూ.. కౌంటింగ్‌ కేంద్రంలో తాను గెలిచినట్లు చెప్పి తిరిగి రీకౌంటింగ్‌ పేరుతో టీడీపీ గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఇదే విషయాన్ని మంత్రి టీజీ భరత్‌ దృష్టికి తీసుకెళ్తే బయటకు పంపించడని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. 15వ వార్డు కార్పొరేటర్‌గా గెలిచిన మల్లిఖా సుమయా మాట్లాడుతూ.. తనను ప్రచారం చేయనీయకుండా టీడీపీ నాయకులు ఇబ్బందులు పెట్టారన్నారు. విలేకరుల సమావేశంలో గెలిచిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎస్‌టీ షేక్‌ అహమ్మద్‌, షేక్‌ జుబేర్‌, మహమ్మద్‌ ఖలీల్‌, ఉస్తాద్‌ నర్గీస్‌ అలీ, అర్షియా ఫర్హీన్‌, షేక్‌ మహబూబ్‌బీ, కురువ దీప్తి, జగ్గుల శరణమ్మ, సంధ్య పోగు సౌజన్యలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement