నంద్యాల(న్యూటౌన్): ఏసు క్రీస్తు లోక రక్షణార్థమై ప్రాణతాగ్యం చేశారని, ఆయన త్యాగానికి ఫలితంగానే మానవులకు పాప విమోచన లభించిందని బిషప్ సంతోష్ ప్రసన్నరావు అన్నారు. పట్టణంలోని పొగాకు కంపెనీ నంద్యాల బైపాస్ ప్రధాన రహదారి సమీపంలో ఉన్న క్రైస్తవుల సమాధుల తోటలో సోమ వారం సమాధుల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మొదటగా కుటుంబ సభ్యులు సమాధుల వద్దకు చేరుకొని ప్రత్యేకంగా అలంకరించారు. పాస్టర్ల ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి అక్కడే సామూహిక ప్రార్థనలు చేశారు. చనిపోయిన వారి ఆత్మలకు మోక్షం ప్రసాదించాలని ఏసును వేడుకున్నారు. నంద్యాల డయాసిస్ పీఠాధిపతులు బిషప్ ది రైట్ రెవరెండ్ సంతోష్‌ప్రసన్నరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన మాట్లాడుతూ బతికిన కాలంలో చిన్న చిన్న తప్పులు చేసి మృతి చెందిన వ్యక్తులు స్వర్గానికి, నరకానికి మధ్యలో ఉండిపోతారని అటువంటి వారి ఆత్మలు దైవ సన్నిధికి చేరడానికి ఏటా నవంబర్ 2వ తేదీన ఆత్మల దినోత్సవం జరుపుతారన్నారు. పాపాలను విడిచి పెట్టి దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా జీవించాలని సూచించారు. అలాగే నంద్యాల డయాసిస్ పరిధిలో అన్ని పాస్టరేట్ సంఘాల్లో సమాదుల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నంద్యాల హోలీక్రాస్ క్యాథడ్రల్ పాస్టరేట్–1 డీనరీ చైర్మన్ కొత్తమాసీ జోసెఫ్, పాస్టరేట్–2 డీనరీ చైర్మన్ మైఖేల్ సామేల్, పాస్టరేట్–3 డీనరీ చైర్మన్ సామేల్‌రత్నరాజ్ గురువులు అన్నారు. పాస్టర్లు విజయకుమార్, జోయల్, భాస్కర్, జీవన్, మారడోన, పాల్‌రాజారావు, తదితరులు పాల్గొన్నారు.


