కర్నూలు(అర్బన్): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా, ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటల్లోపు కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ పేపర్ బాక్సులను తెరిచే సమయంలో, కౌంటింగ్ అనంతరం సీల్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా టేబుల్ వద్ద సమస్య తలెత్తినప్పుడు సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ ఆఫీసర్‌లను సంప్రదించి వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, గూడూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


