కర్నూలు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ సమయానికి 48 గంటల ముందుగానే రూరల్ మండలాల్లో అన్ని మద్యం దుకాణాలు 48 గంటల వరకు మూసివేస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి ఎం.సుధీర్ బాబు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఉత్తర్వుల మేరకు ఎన్నికలు జరిగే అన్ని మండలాల్లో మద్యం రిటైల్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు పూర్తిగా అమ్మకాలు జరగకుండా మూసివేస్తున్నట్లు సుధీర్ బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో 5 కి.మీ లోపు ఉన్న అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని బళ్లారి, రాయచూరు, గద్వాల జిల్లా కలెక్టర్లకు కూడా లేఖ రాశామన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే పట్టణ ప్రాంతాల్లో కూడా 3వ తేదీ పూర్తిగా మద్యం షాపులు మూసివేయిస్తున్నట్లు తెలిపారు.


