కర్నూలు(అర్బన్): మురసు తుపాను నేపథ్యంలో రానున్న రెండు, మూడు రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయానికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08518–277305ను సంప్రదించాలన్నారు.
గ్రీన్ క్రాకర్స్‌నే కొనుగోలు చేయండి
కర్నూలు(అర్బన్): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనల మేరకు దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్‌ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. గ్రీన్ క్రాకర్స్ శబ్ధ, కాలుష్యరహితం కావడంతో పర్యావరణానికి హాని కలిగించే పరిస్థితి ఉండదన్నారు. అదేవిధంగా దీపావళి సమయంలో కాల్చే బాణసంచాను నిర్దేశించిన సమయాల్లో మాత్రమే కాల్చాలని సూచించారు. బ్యాన్ చేసిన, కాల పరిమితి దాటిన బాణసంచాను ఉపయోగించరాదన్నారు.
గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగం
కర్నూలు(అర్బన్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న నిర్వహించనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను అనుమతించిందని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో ఎన్నికల సంఘం సూచించిన 20 రకాల ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆమె సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
6న డాక్ అదాలత్
కర్నూలు(అర్బన్): తపాలా కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ నెల 6న ఉదయం 11 గంటలకు స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో డాక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జీ.జనార్దన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ఫిర్యాదులను ఈ నెల 4న డివిజన్ కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. ఫిర్యాదులను పోస్టు ద్వారా పంపే వారు ఈ నెల 4వ తేది లేదా అంతకుముందు చేరేలా పోస్టు కవర్‌పై ‘డాక్ అదాలత్’ అని పెద్ద అక్షరాలతో రాసి పంపాలన్నారు. ఫిర్యాదుదారులు నేరుగా 6వ తేదిన నిర్వహించే డాక్ అదాలత్ కార్యక్రమానికి హాజరు కావచ్చన్నారు. అక్కడ ఫిర్యాదులను పరిశీలించి అర్జీకి సంబంధించిన పరిష్కార లెటర్/ ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామన్నారు.
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
కర్నూలు: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన పీట్ల రామకృష్ణ కుమార్తె వడ్డె పీట్ల శ్వేత (16) కళాశాల నుంచి అదృశ్యమైంది. కర్నూలు మండలం బి.తాండ్రపాడు సమీపంలో ఉన్న ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. వీరి కుటుంబం ప్రస్తుతం ఆత్మకూరులో నివాసముంటోంది. 1వ తేదీ ఉదయం 10.30 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 5.6 అడుగుల ఎత్తు, తెలుపు వర్ణం, పొడవాటి నల్లటి జుట్టు, ముక్కుపుడక ధరించింది. విద్యార్థిని ఆచూకీ గురించి సమాచారం తెలిస్తే 91211 01063, 8919668119కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని కర్నూలు అర్బన్ తాలూకా ఎస్‌ఐ మోహన్ కిషోర్ రెడ్డి కోరారు.
వర్షాల్లేక ముందుకు సాగని రబీ
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై అల్పపీడనాలు, తుపానులు ఎలాంటి ప్రభావం చూపని పరిస్థితి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మురను తుపాను కేంద్రీకృతమైంది. ఇది తీవ్రమైన తుపానుగా మారుతోంది. కోస్తాంధ్ర జిల్లాలు తుపానులు మాకొద్దు బాబోయ్ అంటున్నాయి. మాకు కావాలని రాయలసీమ జిల్లాల రైతులు కోరుతున్నారు. రబీ సీజన్ అక్టోబర్ 1 నుంచి మొదలైంది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 109.9 మిమీ ఉండగా.. 20 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. రబీ సాగుకు వాతావరణం సహకరించకపోవడంతో సాగు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. మురసు తుపాను ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు.


