కర్నూలు: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై పోలీసు శాఖ నిషేధం విధించింది. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు శివారులోని అథెనా స్కూల్, గూడూరులోని జెడ్పీహెచ్ స్కూల్‌లో ఉన్న ఇండోర్ స్టేడియం, ఎమ్మిగనూరులోని బనవాసి జవహర్ నవోదయ స్కూల్, ఆదోనిలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సోమవారం విస్తృతంగా పర్యటించి తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వాటిని పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, నిషేధిత వస్తువులు, పెన్నులు, పేపర్లు తీసుకెళ్లడం నిషేధం అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఎస్పీ వెంట స్థానిక పోలీసు అధికారులు ఉన్నారు.


