జిల్లాకు కేటాయించిన స్టాంపుల వివరాలు..
● ఒక్కో నాన్ జ్యుడీషియల్ స్టాంపుపై
అదనంగా రూ.15 ఇవ్వాల్సిందే!
కర్నూలు(సెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాన్ జ్యుడీషియల్ స్టాంపుపై అదనంగా రూ.15 వసూలుకు తెరలేపారు. కర్నూలు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో భూములు, ఆస్తులు, ఇళ్లులు, స్థలాల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్లకు వినియోగించే నాన్ జ్యుడీషియల్ స్టాంపులకు మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉంది. సాధారణంగా వీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు వెండర్లకు ఐదు శాతం కమిషన్ ప్రకారం విక్రయించాలి. అయితే లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీల పేరిట ఒక్కో స్టాంపుపై అదనంగా రూ.15 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాకు కేటాయించిన 3.28 లక్షల స్టాంపులకు వసూలు చేసే అక్రమార్జన సుమారు రూ.49.20 లక్షలు అవుతుంది.
ప్రజలపై అ‘ధన’పు భారం
సాధారణంగా లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఒక్కో స్టాంపుపై అదనంగా ఒకటి లేదంటే రెండు రూపాయలు వసూలు చేసేవారు. ప్రస్తుతం ఒకేసారి ఒక్కో స్టాంపుపై ఏకంగా రూ.15 అదనంగా ఇవ్వాలని అధికారులు చెప్పడంతో కొందరి వెండర్లకు దిక్కుతోచడంలేదు. వాటిని ఎంతకు అమ్ముకోవాలని ప్రశ్నిస్తే అధికారులే నాలుగైదు రెట్లకు అధికంగా అమ్ముకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో నాన్ జ్యుడీషియల్ స్టాంపునకు డిమాండ్ బాగా ఉన్న నేపథ్యంలో విక్రయదారులు కూడా తీసుకుంటారని వారు చెబుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కర్నూలు, కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి అధికారులు సూచించిన రేట్లకు స్టాంపులను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.10 స్టాంపును రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. అలాగే రూ.20 స్టాంపును రూ.150 నుంచి రూ.200లకు, రూ.50 స్టాంపును రూ.250కుపైగా, రూ.100 స్టాంపును రూ.500 వరకు విక్రయిస్తున్నారు.
రూ.50 విలువ కలిగిన స్టాంపులు
1,12,000
రూ.100 స్టాంపులు 1,04,000
రూ.10 స్టాంపులు 1,04,000
రూ.20 స్టాంపులు 8,000


