విధులు మానేసి.. పచ్చ చొక్కాలు వేసుకోవాలి! | - | Sakshi
Sakshi News home page

విధులు మానేసి.. పచ్చ చొక్కాలు వేసుకోవాలి!

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

● పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి

చిప్పగిరి: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే పోలీసులు విధులు మానేసి పచ్చ చొక్కాలు వేసుకొని తిరగాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేశారన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం ముగిసి పోవడంతో అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించకుండా పోలీసులు అనేక రకాలుగా అడ్డుకుంటున్నారన్నారు. చిప్పగిరి మండలం నగరడోణలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లలోకి వెళ్లి చిప్పగిరి ఎస్‌ఐ భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడతామని భయపెడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో అమలవుతున్న రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో పోలీసులు పావులుగా మారడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అన్యాయంగా కేసులు నమోదుచేసే సయమంలో పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎవరూ భయపడవద్దని, ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement