కర్నూలు(అర్బన్): మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నవంబర్ 1న పోలింగ్ జరుగుతున్న దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని దుకాణాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తున్నట్లు సంయుక్త కార్మిక కమిషనర్ సీహెచ్ ఆషాలత తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఉద్యోగ, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఏపీ కార్మిక శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు జోన్ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు పరిధిలోని దుకాణాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఆమె తెలిపారు.
నేడు, రేపు
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కర్నూలు(సెంట్రల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉద్యోగులు ఓటు వినియోగించుకోవచ్చన్నారు. పోస్టల్ ఓటింగ్ ఫెసిలిటేషన్ కేంద్రాలుగా ప్రతి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎంపిక చేశామన్నారు.
రేపు ఎన్నికల
సామగ్రి పంపిణీ
కర్నూలు (టౌన్): పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని ఈనెల 31వ తేదీ శనివారం పంపిణీ చేస్తామని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 1న బ్యాలెట్ బాక్సుల స్వీకరణ, భద్రత నవంబర్ 3న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి విధులపై సంపూర్ణ అవగాహన కల్పించామన్నారు.
నేటితో ముగియనున్న
ఎన్నికల ప్రచారం
ఈనెల 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని ఎలక్షన్ అథారిటీ కమిషనర్ చల్లా ఓబులేసు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓటు వేయడానికి ఓటరు స్లిప్పులు తప్పనరి కాదని తెలిపారు.
క్వింటా వేరుశనగ రూ.7,990
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో గురువారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.7,990 పలికింది. మార్కెట్‌కు 34 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.3,809, మధ్యస్థ ధర రూ.7,020 ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. అదేవిధంగా 38 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా క్వింటా కనిష్ట ధర రూ.7,210, మధ్యస్థ ధర రూ.7,813.. గరిష్ట ధర రూ.7,814 లభించిందన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన
ఓర్వకల్లు: మండలంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. మండలంలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన నన్నూరు, మీదివేముల, హుసేనాపురం పోలింగ్ కేంద్రాలను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆయా కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్ పాల్గొన్నారు.


