కర్నూలు(సెంట్రల్) : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్, బ్యాలెట్ పేపర్ల పంపిణీ, స్వీకరణ, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు సంబంధించి ఆయా అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని, ఎవరూ గైర్హాజరు కాకుండా చూడాలన్నారు. శిక్షణకు గైర్హాజరైన వారిపై సస్పెన్షన్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిన నేపథ్యంలో వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వద్ద భద్రపరచాలని సూచించారు. సామగ్రి పంపిణీ వేగంగా పూర్తయ్యేలా తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు ముందు రోజే చేరుకోవాలని, ప్రిసైడింగ్ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు రహస్యాన్ని కాపాడేలా ఓటింగ్ కంపార్ట్‌మెంట్లను సరైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలన్నారు. వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ల నియామకం ఉన్న కేంద్రాల్లో సంబంధిత సిబ్బంది హాజరును నిర్ధారించుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల పరిసరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. కౌంటింగ్‌కు సంబంధించి మీడియా ప్రతినిధులకు సమాచారం సకాలంలో అందించేందుకు డివిజన్ స్థాయి, జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పేపర్ల నాణ్యత పరిశీలన, భద్రత, పోలింగ్ సామగ్రి పంపిణీ, సిబ్బందికి శిక్షణ పకడ్బందీగా చేపట్టాలని అ ధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు
పరిశ్రమల ఏర్పాటులో పురోగతి సాధించాలి
జిల్లాలో అమలులో ఉన్న పారిశ్రామిక ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను త్వరగా కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి పరిశ్రమ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఆయా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని, పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరిశ్రమల శాఖ అధికారి సంజీవరాజు, ఏపీఐఐసీ జెడ్‌ఎం మధుసూదన్ రెడ్డి, నెడ్‌క్యాప్ అధికారి వీరేంద్ర పాల్గొన్నారు.


