● అధికారులతో వాగ్వాదం
● సీరియల్ నంబర్ ప్రకారమే
కొనసాగిస్తామని అధికారుల హామీ
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణంలోని 19వ వార్డుకు చెందిన బ్యాలెట్ నమూనాలోని సీరియల్ నంబర్లు మార్పు చేయడంపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం పూర్ణచంద్ర, సీపీఐ(ఎం) అభ్యర్థి దాసరి లక్ష్మన్న గురువారం పురపాలక కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. 19వ వార్డులో కౌన్సిలర్ స్థానానికి 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థికి కేటాయించిన 4వ నంబరును 2వ నంబరులోకి 2వ నంబరు కేటాయించిన అభ్యర్థికి 4వ నంబరు కేటాయిస్తున్నట్లు అధికారులు సూచించారు. దీంతో ఒక్కసారి ఖంగుతిన్న అభ్యర్థులు ఆదోని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అధికారులు ఇచ్చిన సీరియల్ నంబర్ ప్రకారమే కరపత్రాలు ముద్రించి ప్రచారాలు చేశామని, ఎన్నికలకు ఒక రోజు ముందు సీరియల్ నంబర్ ఎలా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్ఫాబిటికల్ ప్రకారం తారుమారు చేయాల్సివచ్చిందని ఎన్నికల అధికారులు చెప్పగా.. కేటాయించిన నంబర్లను యాథావిధిగా కొనసాగించాలని పట్టుబట్టారు. లేనిపక్షంలో కలెక్టరు వరకు వెళతామని హెచ్చరించారు. అందుకు స్పందించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్, పురపాలక కమిషనర్ నయిమ్ అహ్మద్.. గతంలో ఉన్న సీరియల్ నంబర్ ప్రకారమే కొనసాగిస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. సీరియల్ నంబర్లతో కూడిన బ్యాలెట్ పత్రాన్ని అధికారికంగా అందజేశారు.


