పేరెంట్స్‌ మధ్య పసుపు చిచ్చు | - | Sakshi
Sakshi News home page

పేరెంట్స్‌ మధ్య పసుపు చిచ్చు

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

కర్నూలు సిటీ: పాఠశాలల్లో తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎస్‌ఎంసీ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ నాయకులు సాధారణ ఎన్నికలను తలపించేలా హడావుడి చేశారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల ఎన్నికలు నిర్వహించారు. అయితే ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఎన్నికలు నిర్వహించేందుకు మెజార్టీ స్థాయిలో ఆసక్తి చూపకపోవడం గమనార్హం. స్కూళ్లలో ఎన్నికల నిర్వహణపై ముందుగానే పేరెంట్స్‌కు తెలియజేయాల్సి ఉండగా.. చాలా స్కూళ్లలో హెచ్‌ఎంలు విస్మరించారు. పలు గ్రామాల్లో టీడీపీ నేతలు చెప్పిన వారికి మాత్రమే ఎన్నికల సమాచారం అందించి, వారు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనేటట్లు చేశారని తెలుస్తోంది. మరి కొంత మంది తల్లిదండ్రులు పాఠశాలలకు రాకపోయినా కూడా వచ్చినట్లు ఎన్నికలు నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన ఎన్నికలను టీడీపీ నేతల జోక్యంతో కొన్నిచోట్ల ఉత్కంఠకు దారితీశాయి. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా కొంత మంది సామాజిక బాధ్యతతో తమ పిల్లలు చదువుతున్న స్కూల్‌ అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే అధికార పార్టీ బలంతో వారిని నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న పేరెంట్స్‌కు కనీసం తాగేందుకు తాగు నీటి సదుపాయం కూడా కల్పించలేదు. చాలా మంది భోజనాలు లేక పోవడంతో ఆకలితో అలమటించారు.

52 స్కూళ్లలో ఎన్నికలు వాయిదా..!

జిల్లాలో అన్ని యాజమాన్యాలకు 2,356 పాఠశాల లు ఉన్నాయి. ఇందులో 1,442 ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు ఉండగా 1,390 స్కూళ్లలో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. 52 స్కూళ్లలో వాయిదా పడ్డాయి. 81 ప్రైవేటు స్కూళ్లలో ఎన్నికలు నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

● కోడుమూరు మండలం అమడగుంట్ల జెడ్పీ హైస్కూల్‌, మెయిన్‌ ఎంపీపీ స్కూల్‌, స్పెషల్‌ ఎంపీపీ స్కూళ్లలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలతో వాయిదా పడ్డాయి. అనుగొండ హై స్కూల్‌లో సభ్యులుగా 9 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారులుగా, ఆరుగురు టీడీపీ మద్దతుదారులుగా ఉన్నారు. ఎన్నికకు కోరం లేకపోయినా చైర్మన్‌గా టీడీపీ మద్దతుదారులనే ప్రకటించారు.

● నందవరం మండలంలో కనకవీడు గ్రామ హైస్కూల్‌, ఆదర్శ ప్రైమరీ స్కూల్‌, ఆదిఆంధ్ర పాఠశాలల్లో సభ్యులుగా ఎన్నికైన వారిలో టీడీపీ మద్దతుదారులు తక్కువగా ఉండడంతో వాయిదా వేశారు.

● తుగ్గలి మండలం ముక్కెళ్ల హైస్కూల్‌లో కోరం లేకపోవడం, రామాపురంలో టీడీపీ నాయకులు ఏకగ్రీవం చేసుకోవాలని ప్రయత్నించగా, ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎన్నిక జరిగితే ఓడిపోతామని టీడీపీ నాయకులు వాయిదా వేయించారు.

● ఆదోని నియోజకవర్గంలో నాలుగు స్కూళ్లలో కమి టీ సభ్యుల్లో టీడీపీ నాయకులు తక్కువగా ఉండడంతో కోరం లేదని ఎన్నికలను వాయిదా వేయించారు.

● 1,800 మంది విద్యార్థులున్నా హొళగుంద జెడ్పీ హైస్కూల్‌లో టీడీపీకి చెందిన రెండువర్గాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డాయి. అయితే ఎవరూ వెనుకడుగు వేయకపోవడంతో ముందుగా నిర్ణయించిన వారికే పదవులు వరించాయి.

● సి.బెళగల్‌ కేజీబీవీ పాఠశాలలో టీడీపీ నాయకులే చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నిక నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు నిమిత్తమాత్రంగా నిలిచిపోయారు. కొందరు స్థానిక నేతలపై ఆరోపణలు చేయడంతో చర్చ సాగింది.

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో

టీడీపీ నేతల హల్‌చల్‌

1,390 స్కూళ్లలో ఎన్నికలు,

52 స్కూళ్లలో వాయిదా

టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి

కొన్ని చోట్ల కోరం లేకపోయినా ఎన్నికలు

పలు స్కూళ్లలో పేరెంట్స్‌కు

సమాచారం ఇవ్వని హెచ్‌ఎంలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement