పప్పు శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

పప్పు శనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

● జిల్లాకు 33,200 క్వింటాళ్ల

శనగ విత్తనాల కేటాయింపు

కర్నూలు(అగ్రికల్చర్‌): రబీ సీజన్‌, ప్రత్యామ్నాయ పంటల సాగుకు శనగ విత్తనాల పంపిణీ మొదలైంది. ఇటీవల కొన్ని మండలాల్లో కొంత మేర వర్షాలు కురవడంతో విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది. విత్తనాల పంపిణీలో చంద్రబాబు సర్కార్‌ చేతులెత్తేసిందనే విమర్శల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం హడావుడిగా విత్తనాల పంపిణీ చేపట్టడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ విత్తణాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌) కర్నూలు సబ్‌ డివిజన్‌లోని వివిధ మండలాల్లో పప్పు శనగ విత్తనాలను సిద్ధం చేసింది. మొదట కర్నూలు జిల్లాకు 25 వేల క్వింటాళ్లు కేటాయించగా.. తర్వాత అదనంగా 8,200 క్వింటాళ్లు కేటాయించింది. మంగళవారం డీ.క్రిషి యాప్‌ ద్వారా విత్తనాల పంపిణీ చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు. నంద్యాల జిల్లాలో విత్తనాల పంపిణీ ఊసే లేకుండా పోయింది.

2న ప్రత్యేక గ్రామ సభలు

కర్నూలు(అర్బన్‌): అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా పంచా య తీ అధికారి జి. భాస్కర్‌ తెలిపారు. మంగళవా రం జెడ్పీ సీఈఓ, నంద్యాల, కర్నూలు డీపీఓలు ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీఓలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ భాస్కర్‌ మాట్లాడుతూ ప్రత్యేక గ్రామ సభల్లో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా తాగునీరు, పరిశుభ్రత, రోడ్లు, వీధి దీపాలు తదితరాలపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. అలాగే స్వచ్ఛతా హీ సేవ, పీపుల్స్‌ క్యాంపెయిన్‌ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గ్రామ సభలో వికసిత్‌ భారత్‌ లక్ష్యాలపై చర్చించాలన్నారు. కర్నూ లు జిల్లాలో పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి 175 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని పరిష్కరించి ఫిర్యాదుదారులతో ఎండార్స్‌మెంట్‌ తీసుకోవాలని, లేని పక్షంలో ఆడిట్‌ అభ్యంతరాలు వస్తాయన్నారు.

ఎంఎల్‌హెచ్‌పీలతో

‘పింక్‌ నారీ’

కర్నూలు(హాస్పిటల్‌): విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో పనిచేసే ఎంఎల్‌హెచ్‌పీలతో త్వరలో పింక్‌ నారీ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమం నోడల్‌ అధికారి డాక్టర్‌ మహేశ్వరప్రసాద్‌ చెప్పారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మహిళల్లో క్యాన్సర్‌ కేసులను గుర్తించి, వారికి చికిత్స, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పింక్‌ నారీ కార్యక్రమం రూపొందించిందన్నారు. ఈ మేరకు జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 35 మంది ఎంఎల్‌హెచ్‌పీలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. వీరు పనిచేసే చోటే ఉంటూ పీహెచ్‌సీ పరిధిలోని మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్‌లను గుర్తించి, మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రెఫర్‌ చేస్తారన్నారు. ఆ తర్వాత కూడా వారు చికిత్స కొనసాగించేటట్లు చూడటం, వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం వంటి బాధ్యతలు ఉంటాయన్నారు. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

నంద్యాల జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ప్రభాకర్‌రెడ్డి!

కర్నూలు(హాస్పిటల్‌): నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల(జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది అడిషనల్‌ డీఎంఈ హోదాలో ఉన్న వైద్యులకు ప్రభుత్వం సూపరింటెండెంట్‌లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. ఇందులో ఇటీవల అడిషనల్‌ డీఎంఈగా పదోన్నతి పొందిన డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి తాజాగా నంద్యాలలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు ఖరారైనట్లు సమాచారం. ఈయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్డియోథొరాసిక్‌ సర్జరీ హెచ్‌ఓడీగా, ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. కొంతకాలం వైజాగ్‌లోనూ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈయనతో పాటు కర్నూలు మెడికల్‌ కాలేజీ పాథాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.బాలేశ్వరిని పిడుగురాళ్ల జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా నియమించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement