ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రత్యేక టీమ్‌లు | - | Sakshi
Sakshi News home page

ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రత్యేక టీమ్‌లు

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): పప్పు శనగ ప్రాసెసింగ్‌ యూనిట్ల తనిఖీలకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేస్తూ జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. రబీ సీజన్‌కు సంబంధించి కర్నూలు జిల్లాకు 25వేలు, నంద్యాల జిల్లాకు 17వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను కేటాయించింది. ప్రాసెసింగ్‌కు కర్నూలులో ఏపీ సీడ్స్‌ సహా ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో ప్రాసెసింగ్‌ యూనిట్‌కు మానిటరింగ్‌ అధికారిగా ఏఓలను, సూపర్‌వైజింగ్‌ అధికారిగా అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్‌ నియమితులయ్యారు. ప్రాసెసింగ్‌ ప్రక్రియను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు డీడీఏ బాలాజీ నాయక్‌ నేతృత్వంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటైంది. ప్రాసెసింగ్‌ యూనిట్ల మానిటరింగ్‌ అధికారులుగా ఏవోలు రాజకిశోర్‌, పాపిరెడ్డి, రామకృష్ణ, కిరణ్‌ వ్యవహరిస్తారు. కాగా సోమవారం అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్‌, కర్నూలు ఏడీఏ దస్తగిరిరెడ్డి, కల్లూరు ఏవో విష్ణువర్థన్‌రెడ్డి, కర్నూలు ఏవో రూఫస్‌రొనాల్డ్‌ చక్రసీడ్స్‌, మురళీధర్‌ సీడ్స్‌, ఏపీ సీడ్స్‌ల్లో తనిఖీలు చేశారు.

క్వింటా ఉల్లి రూ.4,529

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సోమవారం 2,871 క్వింటాళ్ల(89 లాట్లు) ఉల్లి విక్రయానికి వచ్చింది. కనిష్ట ధర రూ.1,015, గరిష్ట ధర రూ.4,529 లభించగా.. సగటు ధర రూ.3,741 నమోదైంది. రీటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60–70 వరకు ఉంటోంది. కిలో 32 ప్రకారం ఉల్లి గడ్డలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ఊసే లేకుండా పోయింది. వేరుశనగకు కనిష్ట ధర రూ.4,512, గరిష్ట ధర రూ.9,416 లభించగా.. సగటు ధర రూ.9,016 నమోదు అయింది. మొక్కజొన్నలకు రూ.2,550 ధర లభించింది.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

కర్నూలు: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురి వద్ద నుంచి రూ.18 లక్షలు తీసుకుని సంపంగి వెంకటేశ్వర్లు మోసం చేశాడని కర్నూలు మండలం దిన్నెదేవరపాడుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఐడీ కార్డులు, ఇంటర్వ్యూ లెటర్లు ఇచ్చి రూ.4 లక్షలు తీసుకుని కడప జిల్లాకు చెందిన మహిళ మోసం చేసిందని కల్లూరు మండలానికి చెందిన రవితేజ, జయచంద్ర, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 108 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు తగు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, మస్తాన్‌ వలి, రామకృష్ణ తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

వరసిద్ధి వినాయకుడికి

మహానందీశ్వరుడి పట్టు వస్త్రాలు

మహానంది: కాణిపాకంలో వెలిసిన వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ మహానందీశ్వరస్వామి దేవస్థానం తరపున సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్‌ అంబటి శశిధర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో కాణిపాకం దేవస్థానానికి చేరుకోగా కాణిపాకం ఈఓ మణినాయుడు, ఏఈఓ వేల్పుల ధనుంజయ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ మేరకు మేళతాళాలు, వాయిద్యాల నడుమ స్వామివారికి పట్టువస్త్రాలు అందించారు. అనంతరం మహానంది ఈఓ శ్రీనివాసరెడ్డితో పాటు చైర్మన్‌, ధర్మకర్తల మండలి సభ్యులకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడి ప్రసాదాలు, చిత్రపటాలు అందించి వేదాశీర్వచనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement