ఆపత్కాల నిధులను విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆపత్కాల నిధులను విడుదల చేయండి

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

● పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కోరిన తాజా మాజీ జెడ్పీటీసీలు

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలోని పశ్చిమ ప్రాంత పల్లెల్లో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉందని, ప్రజల దాహార్తి తీర్చేందుకు జెడ్పీ ఆపత్కాల నిధులు 4 శాతాన్ని విడుదల చేయడంతోపాటు ప్రతిపాదించిన రూ.6.79 కోట్ల తాగనీటి పనులను ఆమోదించాలని కోరుతూ తాజా మాజీ జెడ్పీటీసీలు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, జేసీ నూరుల్‌ ఖమర్‌ నేతృత్వంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అందులో భాగంగా తాజా మాజీ జెడ్పీటీసీలు పి.ఉపేంద్రారెడ్డి, బి.రామకృష్ణ, పి.అనసూయమ్మ, పి.జగదీశ్వరరెడ్డి తదితరులు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేసి తాగునీటి ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే గతంలో జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రతిపాదించిన తాగునీటి మరమ్మతులు, ఇతర పనులకు ఆమోదం తెలపాలని కోరారు.

● హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ నుంచి తన కుమారుడిని తొలగించాలని తుగ్గలి మండలం గుండాల తండాకు చెందిన రాముడు నాయక్‌ ఫిర్యాదు చేశాడు. తన వయస్సు 60ఏళ్లకు పైగా ఉందని, అయితే సైంటిస్టుగా పనిచేస్తున్న కుమారుడు పేరు తన రేషన్‌కార్డులో ఉండటంతో వృద్ధాప్య పింఛనుకు నోచుకోవడం లేదన్నారు. తన పోషణను కూడా కుమారుడు పట్టించుకోవడం లేదని, అధికారులు న్యాయం చేయాలని రాముడు నాయక్‌ దంపతులు కోరారు.

● నగరంలోని బీసీ సర్కిల్‌లో మౌలిక వసతులు కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం.రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ వినతిపత్రం ఇచ్చారు.

● నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌, బళ్లారి చౌరస్తా, సీక్యాంపు, నంద్యాల చెక్‌పోస్టు, రైల్వేస్టేషన్లలో కూల్‌ డ్రింక్స్‌, ప్యాక్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిళ్లను ఎమ్మార్పీకి కాకుండా ఒక్కో దానిపై రూ.2 నుంచి రూ.10 వరకు అధిక ధరలకు అమ్ముతున్నారని వీవీఎస్‌ అధ్యక్షుడు పగడాల ఆనంద్‌బాబు జేసీకి ఫిర్యాదు చేశారు.

● కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని, వలసలను నివారించేందుకు మూతపడిన హాస్టళ్లను పునః ప్రారంభించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈరేష్‌, బి.రంగస్వామి వినతిపత్రం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement