● రాష్ట్రంలో నిరంకుశ పాలన
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): శాంతియుతంగా విజయవాడలో ఆందోళన చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. మహిళా ఉద్యోగుల జుట్టు పట్టి ఈడ్చటం, లాగి పడేయడం అమానుషం అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రోడ్డెక్కడం ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. భయంకరమైన కరోనా సమయంలో ప్రజలకు విశేషమైన సేవలు అందించిన సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ఉద్యోగులను, సోషల్‌మీడియా కార్యకర్తలను బెదిరించడంతోపాటు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, ఇదేం రాజ్యాంగం అని ప్రశ్నించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్‌సీ తక్షణం అమలు చేసి ఏడాదిలోపు కొత్త పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యోగులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో
గణనీయమైన అభివృద్ధి
తమ ప్రభుత్వంలో కర్నూలులో గణనీయమైన అభివృద్ధి జరిగిందని ఎస్వీ మోహన్‌రెడ్డి వివరించారు. అమృత్ స్కీమ్ ద్వారా రూ. 65 కోట్లతో ఉచితంగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఆనంద్ థియేటర్ నుంచి స్విమ్మింగ్‌పూల్ మీదుగా గౌరీగోపాల్‌కు వెళ్లేందుకు బ్రిడ్జి ఏర్పాటు చేశామన్నారు. జొహరాపురం వద్ద హైలెవల్ బ్రిడ్జి, బస్సుల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు శ్రీనివాసనగర్ వరకు రహదారులు నిర్మించామన్నారు. జొహరాపురం నుంచి నంద్యాల చెక్‌పోస్టు వైపు వెళ్లేందుకు రహదారి ఏర్పడిందన్నారు. కొత్త ఈద్గాల అభివృద్ధికి పనులు చేశామన్నారు. ముస్లింలకు సంబంధించిన ఇస్తెమాకు అప్పటి ప్రభుత్వ నిధులు వెచ్చించామన్నారు. క్రైస్తవుల శ్మశాన వాటిక కోసం ఐదు ఎకరాలు కేటాయింపుతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
మంత్రి టీజీ భరత్.. కర్నూలులో ఏం అబివృద్ధి చేశారు?
కర్నూలు అభివృద్ధికి మంత్రిగా ఉన్న టీజీ భరత్ ఏంచేశారని ఎస్వీ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే పెద్ద సర్కిల్‌ను చిన్నగా, చిన్న డివైడర్లను పెద్దగా చేయడం, రంగులు వేయడం కాదన్నారు. కనీసం ఒక టీఎంసీ సామర్థ్యంతో చెక్‌డ్యామ్ నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది చంద్రబాబేనని, ముఖ్యమంత్రిగా ఇప్పుడైనా పూర్తి చేస్తారా అని ప్రశ్నించారు. టీబీ డ్యాం నుంచి ఒక టీఎంసీ నీటిని తరలించి వినాయక నిమజ్జనం సజావుగా జరపాలని తాము సూచిస్తే గోడలు కట్టి చేయడం ఏమిటని ప్రశ్నించారు. గోశాల గురించి మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్.. గోశాల పేరుతో వాణిజ్య సముదాయాలు, సినిమా కాంప్లెక్స్‌లు నిర్మించుకోలేదా అని ప్రశ్నించారు.


