రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

నందవరం: మండల పరిధిలోని ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగతి గ్రామానికి చెందిన బారిక ఈశ్వర్‌ (38) బుధవారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.. బారిక ఈశ్వర్‌ బుధవారం బైక్‌పై హాలహర్వి నుంచి స్వగ్రామానికి బయలు దేరాడు. అలాగే కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ చెందిన వెంకట్‌రెడ్డి తన కారులో ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం మీదుగా రాయచూర్‌కి బయలుదేరారు. నందవరం మండలంలోని ముగతి గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిపై కంకర మిషన్‌ సమీపంలో కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వర్‌ తల, కాళ్లకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య రామలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిమ్మారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మహిళ మృతదేహం లభ్యం

పెద్దకడబూరు: మండల కేంద్రంలో ఎల్లెల్సీలో గుర్తు తెలియని మహిళ శవం కొట్టుకొచ్చింది. కాలువలో బుధవారం మహిళ మృతదేహం కొట్టుకొచ్చి సల్లమ్మవ్వ వాగు వద్ద ఉన్న అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి వద్ద చెత్తాచెదారంతో కలిసి ఉండిపోయింది. శవం పూర్తిగా ఉబ్బి పోవడంతో బ్రిడ్జి కిందకు పోకుండా అక్కడే నిలిచిపోయింది. అటుగా వెళుతున్న స్థానికుల వివరాల మేరకు మృతురాలు తెలుపు రంగు దుస్తులు ధరించినట్లు పేర్కొన్నారు. మహిళ మృతదేహం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో, ఆమె ఎవరో? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వ్యక్తి దారుణహత్య

కర్నూలు (అగ్రికల్చర్‌): నగరంలోని గోపాల్‌ దర్వాజా వద్ద తుంగభద్ర నది ఒడ్డున గొల్ల హరీష్‌ (32) దారుణహత్యకు గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నగరానికి చెందిన గొల్ల శారదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శారదమ్మ చిన్న కుమారుడు హరీష్‌ తన ఇంటికి ఎదురుగా నివసించే ఎరుకలి ఉమతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఉమ భర్త హరికృష్ణ గతంలో పలుమార్లు హరీష్‌ను హెచ్చరించాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోకపోతే చంపుతానని బెదిరించినట్లు శారదమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో శారదమ్మ ఇంటి వద్ద ఉండగా స్థానికంగా నివసించే కడియాల నాగేంద్ర వచ్చి కుమారుడి హత్య గురించి సమాచారమిచ్చారు. హరీష్‌, మరికొందరు గంగమ్మ ఆలయం వెనుక వైపు వెళ్లిన కొద్దిసేపటికి కేకలు వినిపించడంతో అక్కడికి వెళ్లగా ఎరుకలి హరికృష్ణ, ప్రసాద్‌, వెంకటేష్‌ హడావుడిగా వెళ్తూ కనిపించా రని పేర్కొన్నారు. హరీష్‌ తలకు తీవ్ర గాయాల తో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న శారదమ్మ పెద్ద కుమారుడు అశోక్‌, నాగేంద్రతో కలిసి వెళ్లి చూడగా హరీష్‌ అప్పటికే మృతిచెందాడు. వివాహేతర సంబంధం కారణంగా హరీష్‌ను ముగ్గురూ కలిసి బండరాయితో తలపై మోదడంతో రక్తగాయాలై మృతి చెందినట్లు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కెమికల్‌ ఫ్యాక్టరీ

సూపర్‌వైజర్‌ దుర్మరణం

కర్నూలు (అగ్రికల్చర్‌): కల్లూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని రఘునాథ్‌ డై కెమికల్‌ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మణికంఠ రెడ్డి (32) విధు ల్లో ఉండగా దుర్మరణం పాలయ్యాడు. కర్నూలు మండలం బి.తాండ్రపాడు ఎస్సీ కాలనీ సమీపంలోని చైతన్య స్కూల్‌ వద్ద ఫ్లాట్‌ నంబర్‌ 9లో దుర్గా రామకృష్ణారెడ్డి కుటుంబం నివసిస్తోంది. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు 2017 నుంచి రఘునాథ్‌ డై కెమికల్‌ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఫ్యాక్టరీలో 12 అడుగుల ఎత్తులో పనిచేస్తూ కింద పడటంతో తీవ్ర రక్తగాయాలయ్యాయని, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నామని సంబంధిత ఫ్యాక్టరీ నుంచి రామకృష్ణా రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందింది. కుటుంబసభ్యులు వెంటనే వెళ్లి డాక్టర్లను సంప్రదించగా.. ఆస్పత్రికి వచ్చేలోపే మృతి చెందినట్లు తెలిపారు. కాగా కుమారుడి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని తండ్రి, కుటుంబ సభ్యులు నాలుగవ పట్టణ సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతి

కొలిమిగుండ్ల(అవుకు): అవుకులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 16వ తేదీ రాత్రి కత్తిపోట్లకు గురైన ఉయ్యాలవాడ మధు సుధాకర్‌ (38) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుధాకర్‌కు, వెంకటేష్‌ అనే వ్యక్తికి పాత గొడవలు ఉన్నాయి. వినాయక నిమజ్జనంలో అందరూ చూస్తుండగానే సుధాకర్‌ను వెంకటేష్‌ కత్తితో చాతీలో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. ఘటన జరిగిన రోజే పోలీసులు వెంకటేష్‌ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement