కోసిగి: మండల పరిధిలోని జుమ్మాలదిన్నె గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో 20 మందికి పైగా జ్వరం బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతూ అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన రాగయ్య అనే వ్యక్తి ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకోగా రూ.60 వేలు ఖర్చయినట్లు వాపోయారు. అలాగే తిక్కయ్య, కృష్ణ, మల్లేశ్వరితో పాటు మరో ముగ్గురు జ్వరంతో ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. ప్రసాద్, సునీత దంపతుల కుమారుడు వైభవ్ తేజ్ అనే బాలుడికి మూడు రోజులుగా కోసిగిలో వైద్య సేవలు అందించినా జ్వరం తగ్గడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. రాజు, సువర్ణమ్మ దంపతుల పిల్లలు జస్వన్, మహిమాలీ, ఈషా జ్వరంతో చికిత్స పొందుతున్నారు. మరికొందరు స్థానికంగా ఆర్‌ఎంపీ డాక్టర్ వద్ద చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపారు. గ్రామం చుట్టూ మట్టి దిబ్బలు, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టకపోవడంతో విషజ్వరాలు ప్రబలుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దోమలు నివారణ చర్యలు, పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరుతున్నారు.
కుమారుడికి మూడు రోజులుగా జ్వరం తగ్గలేదని చూపుతున్న తండ్రి
ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన రాగయ్య
ఆదోనిలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
పొందుతున్న తిక్కయ్య


