వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

ఆదోని రూరల్‌: మండలంలోని గణేకల్లు గ్రామానికి చెందిన మేసీ్త్ర నాగరాజు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కనిపించకుండా పోయాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్టాండు వద్ద అదృశ్యమయ్యాడని పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 90591 26816, 97010 97287 నంబర్లకు ఫోన్‌ చేసి తెలియజేయాలని కోరారు.

ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ

ఎమ్మిగనూరురూరల్‌: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్‌ లక్ష్మన్న. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి నాగలదిన్నెకు వెళ్లిన నైట్‌ సర్వీస్‌ బస్సులో ప్రయాణికుడు బజారప్ప హ్యాండ్‌ బ్యాగ్‌ మరచిపోయాడు. రాత్రి డ్యూటీలో ఉన్న కండెక్టర్‌ బ్యాగ్‌ను గుర్తించి, చెక్‌ చేయగా అందులో రూ.5,500 నగదు, రేషన్‌ కార్డు ఉంది. రేషన్‌కార్డులోని వివరాల ఆధారంగా ప్రయాణికుడిని గుర్తించి ఆదివారం ఆర్టీసీ డిపోకు రప్పించి నగదు, బ్యాగ్‌ అప్పగించారు. ఇందుకు సదరు ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ డీఎం మద్దిలేటినాయుడుతో పాటు తోటి ఉద్యోగులు కండెక్టర లక్ష్మన్నను అభినందించారు.

బైక్‌ ఢీకొని మహిళ దుర్మరణం

ఆళ్లగడ్డ: మండల పరిధిలోని నల్లగట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జయలక్ష్మమ్మ (60) మృతి చెందారు. జయలక్ష్మమ్మ హైవే రోడ్డు దాటుతుండగా నంద్యాలకు చెందిన సమీర్‌ ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు బైక్‌పై వెళ్తూ ఢీ కొట్టా డు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడిక్కడే మృతి చెందగా గాయపడ్డ సమీర్‌ను నంద్యాల వైద్యశాలకు తరలించారు. రూరల్‌ పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కృష్ణానదిలో మునిగి

యువకుడి మృతి

శ్రీశైలంప్రాజెక్ట్‌: శ్రీశైలం డ్యాం ముందు భాగంలోని కృష్ణానదిలో మునిగి ముంబైకి చెందిన సచిన్‌రాజ్‌పుత్‌(22) మృతి చెందాడు. ముంబైకి చెందిన అభిషేక్‌ చతుర్వేది(29) అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విప్రో ఉద్యోగి సచిన్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీ ఉద్యోగి అభిషేక్‌ తెలంగాణ వైపు ఉన్న ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ఎగ్జిట్‌ టన్నెల్‌ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణానదిలో స్నానం చేస్తు మునిగిపోయారు. గమనించిన స్థానిక మత్స్యకారులు ఇద్దరిని బయటకు తీసుకురాగా సచిన్‌ అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. అభిషేక్‌ను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.

అదృశ్యమైన మహిళల ఆచూకీ తేల్చాలి

నంద్యాల(న్యూటౌన్‌): అదృశ్యమైన మహిళల ఆచూకీ తక్షణమే తేల్చాలని నంద్యాల జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, రజిత డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. గత 15 రోజులుగా అదృశ్యమై మిస్టరీగా మారిన నంద్యాలకు చెందిన నజియా, రాయపాడుకు చెందిన వివాహిత ఆదిలక్ష్మి ఆచూకీని తక్షణమే తేల్చాలన్నారు. గత నెల 18వ తేదీన అదృశ్యమైన ఈ ఇద్దరు మహిళలు ఎక్కడికి వెళ్లారు, వారు సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయాలపై రోజులు గడుస్తున్నా స్పష్టత రాకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందనన్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నజియా అదృశ్యం వెనుక ఆదిలక్ష్మి ప్రమేయం ఉందనే అనుమానాలతో గత రాత్రి రాయపాడులోని ఆదిలక్ష్మి ఇంటి వద్ద నజియా బంధువులు ప్రశ్నించడం, ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని, బాధిత కుటుంబాలకు త్వరితగతిన న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

చామంతి తోట తొలగింపు

బేతంచెర్ల: చామంతి తోటను ట్రాక్టర్‌తో దున్నేస్తున్న ఈ రైతు పేరు పిళ్లి సూర్యనారాయణ. బేతంచెర్ల మండలం సీతారామాపురానికి చెందిన ఈయన జూలైలో రెండెకరాల్లో 50 వేల సెంటు చామంతి రకం మొక్కలు నాటాడు. వర్షాలు లేక పంటలో ఎదుగుదల లోపించింది. ఎండుకొమ్మ తెగులు సోకడంతో ఆదివారం పంటను ట్రాక్టర్‌తో ఇలా దున్నించేశాడు. సాగు కోసం ఇప్పటివరకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశానని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement